– మరమ్మతుకు నోచుకోక బీటలు వారిన సైఫన్లు
– ఆసియా లో మొదటి సైఫన్ సిస్టమ్ ప్రాజెక్టు
– ప్రాజెక్టు సామర్థ్యం నీటి మట్టం వస్తే ఆటోమెటిగా సైఫన్లు ఓపెన్
– బలహీనపడిన ఆనకట్ట
– బీ ఆర్ ఎస్ అధికారం లో తెగిన ఆనకట్ట
– అధికారులు హెచ్చరించినా పట్టించుకోని కెసిఆర్ సర్కార్
– నిర్మాణం నుంచి మరమ్మత్తు లకు నోచుకోని సైఫన్ లు
……………………………………….
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………….
ప్రపంచం లో రెండవ…ఆసియా ఖండం లోనే మొదటి సైఫన్ సిస్టం కలిగిన సరళాసాగర్ ప్రాజెక్టు ప్రమాదం అంచుల్లో ఉంది. ఈ ప్రాజెక్టు పై నీటిపారుదల అధికారులు ప్రభుత్వాలకు నివేదికలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. అధికారుల హెచ్చరికలు పట్టించుకోకపోవడం తో 2019 లో నీటి ఉదృతికి ఆనకట్టకు గండి పడి నీరంతా వృథాగా వెళ్లాయి. ఆ ఏడాది ప్రాజెక్టు లో చుక్క నీరు నిలువకుండా వెళ్లడం తో ఆయకట్టు రైతులు పంటలు సాగుచేసుకోలేక పోయారు. ఈ ప్రాజెక్టు కింద 4200 ఎకరాల ఆయకట్టు సాగావుతోంది. పలు గ్రామాలకు తాగునీటి సరఫరా ఈ ప్రాజెక్టు నుంచే జరుగుతుంది. ఈ ప్రాజెక్టు కు గొప్ప చరిత్ర ఉండడం తో ప్రత్యేకత సంతరించుకుంది. దేశంలోనే ఇలాంటి ప్రాజెక్టు ఎక్కడా నిర్మించలేదు.ఆసియా ఖండం లో నే సైఫన్ సిస్టం ఉన్న ఇది మొదటి ప్రాజెక్టు కావడం… ప్రపంచం లోనే రెండో సైఫన్ సిస్టం ప్రాజెక్టు కావడం విశేషం. మన దేశంలో ఇలాంటి ప్రాజెక్టు మొదటిది కావడం తో దీన్ని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వాలది. కానీ ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కు ఉన్న సైఫన్ దిమ్మెలు బీటలువారి పగిలిపోయే పరిస్థితి నెలకొంది. నీటిపారుదల శాఖ అధికారులు కూడా గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా మరమ్మతులను చేపట్టలేదు. ఏదైనా ప్రమాదం జరిగితే తప్పా ప్రభుత్వం స్పందించే అలవాటుగా మారింది. ముందస్తు చర్యలు తీసుకుంటే ఈ ప్రాజెక్టును ప్రమాదం నుంచి కాపాడే అవకాశం ఉంటుంది.
………………………………………
ప్రాజెక్టు వివరాలివి :
………………………………………
వనపర్తి సంస్థానాన్ని పరిపాలించిన రెండవ రామేశ్వరరావు కాలంలో సరళాదేవి పేరు తో ఈ ప్రాజెక్టు ను నిర్మించారు.ప్రాజెక్టు నిర్మాణానికి ముందుగా అప్పటి అధికారులు అమెరికా లోని కాలిఫోర్నియా అధ్యయనం చేశారు.అనంతరం
శంకరమ్మపేటలో (ప్రస్తుతం మదనాపురం మండలం)రూ.35 లక్షలతో వ్యయంతో నిర్మాణం చేపట్టారు.ఈ ప్రాజెక్ట్ ను 1949 సెప్టెంబరు 15 న ఆనాటి హైదరాబాద్ మిలిటరీ గవర్నర్ జనరల్ జయంతో నాథ్ చౌదరి ఊకచెట్టు వాగు మీద శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 0.42 టీఎంసీ లు కాగా పది గ్రామాలకు సాగు నీరు అందుతుంది. 1959 జూలై 26 వ తేదిన సరళా సాగర్ ను పూర్తి స్థాయి ప్రాజెక్టుగా తీర్చిదిద్దారు. ఈ ప్రాజెక్టు కు క్రస్టు గేట్లు అమర్చకుండా నీరు ప్రాజెక్టు స్థాయి కి చేరుకున్న సమయం లో ఆటోమెటిక్ గా నీరు వెళ్లేందుకు సైఫన్ సిస్టం ఏర్పాటు చేశారు. ఈ పద్ధతి ఇండియా లోనే ఏ ప్రాజెక్టు కు లేదు. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిమట్టం చేరినప్పుడు సైఫన్ లు వాతంతటా అవే ఆటోమెటిక్ గా తెరుచుకుంటాయి.వర్ష కాలంలో వాగులు ప్రవహిస్తేనే ప్రాజెక్టు కు నీరు వచ్చి చేరుతుంది. దీంతో వర్షాలు సమృద్ధిగా కురవకుంటే ప్రాజెక్టు లో నీరుండదు. ఇది దృష్టిలో పెట్టుకున్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిరంతరం నీటితో ఉండటానికి ప్రాజెక్టు కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రామన్ పాడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా రూ.12 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని 2008 లో చేపట్టారు.నాటి నుంచి అనేక గ్రామాల రైతుల పంటలకు నీరు అందిస్తుంది.బీ ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్ట్ పర్యవేక్షణ కొరవడడంతో 2019 ఆనకట్టకు భారీ గండి పడింది. దీంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది.2020 ఆగస్టు నాటికి ఆనకట్టను పునరుద్ధరించారు.
……………………………….
1960 మొదటిసారి తెరుచుకున్న సైఫన్లు :
………………………………….
సరళసాగర్ ప్రాజెక్టు సైఫన్లు ఆటోమెటిక్ గా 1960లో మొదటిసారిగా తెరుచుకున్నాయి. 1964లో భారీ వర్షాలు రావడంతో ఈ ప్రాజెక్టు ఎగువన ఉన్న శంకరసముద్రం చెరువు ఆనకట్ట తెగి సరళాసాగర్‌కు భారీ వరద వచ్చింది.దీంతో ప్రాజెక్టు ఆనకట్ట తెగిపోయింది. దీంతో నీటి ఉధృతి తట్టుకునేందుకు రాతి తో అలుగు ఏర్పాటు చేశారు.
2019లో సైఫన్లు తెరుచుకునే సమయంలోనే కట్ట తెగిపోవడంతో నీరంతా కృష్ణనదిలోకి వెళ్ళింది.ప్రాజెక్టు లో 1095 అడుగులకు నీరు చేరితే అన్ని సైఫన్లు ఆటోమెటిక్ గా తెరుచుకుంటాయి.
ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా 82 క్యూసెక్కుల నీరు విడుదలై వనపర్తి జిల్లా లోని ఎనిమిది గ్రామాల్లో 3,769.20 ఎకరాలకు సాగునీరు అందుతుంది. కుడి కాలువ ద్వారా 6.89 క్యూసెక్కుల నీరు విడుదలై రెండు గ్రామాల్లోని 388.22 ఎకరాలకు సాగునీరు అందుతుంది.కొత్తకోట, మదనాపురం మండలంలోని పది గ్రామాలకు సాగునీరు చేరుతుంది. ఎడమ కాల్వ ద్వారా మదనాపురం మండలంలోని శంకరమ్మపేట, దంతనూరు, మదనాపురం, తిర్మలాయపల్లి, రామన్‌పాడు, అజ్జకోలు, కొన్నూరు, నర్సింగాపురంలోని 3,769.20 ఎకరాలకు, కొత్తకోట మండలం రామానంతపురం, చర్లపల్లి గ్రామాల్లోని 388.22 ఎకరాలకు సాగునీరు అందుతుంది.ఈ ప్రాజెక్టు ద్వారా పలు గ్రామాలకు తాగు నీరు సరఫరా అవుతోంది. ఇంతటి బృహత్తర ప్రాజెక్టు కు మరమ్మతులు లేక శితిలావస్థకు చేరుకుంది. ప్రపంచం లోనే రెండవ సైఫన్ సిస్టం ప్రాజెక్టు గా పేరొందిన ఈ సరళసాగర్ ప్రాజెక్టు కు ఉన్న సైఫన్ లు మరమ్మతుకు నోచుకోక బీటలు వారాయి. ఈ విషయాన్ని నీటిపారుదల శాఖ అధికారులు గత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా అప్పటి సీఎం కెసిఆర్ పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టి ఈ ప్రాజెక్టు సైఫన్ సిస్టం కు మరమ్మతులు చేయాలని ఇక్కడి రైతాంగం విజ్ఞప్తి చేస్తోంది. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్పందించి ఈ ప్రాజెక్టు మరమ్మత్తుల పై ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లే బాధ్యత ఉంది.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.