ముద్ర, నారాయణ పేట:
హిందుత్వ సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన ప్రముఖ వ్యక్తి వీర సావర్కర్ అని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి కన్న శివకుమార్ అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ చౌరస్తాలో వీరసావర్కర్ వర్ధంతి వేడుకలను విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చౌరస్తాలో ఉన్న సావర్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వీర సావర్కర్ 1883 సంవత్సరం నాసిక్ సమీపంలోని భాగూర్ గ్రామంలో జన్మించాడన్నారు. వీర సావర్కర్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, రాజకీయ నాయకుడన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా విప్లవ కార్యకలాపాలు చేశాడని తెలిపారు. అభినవ భారత్ అనే విప్లవ సంస్థను స్థాపించాడనీ పేర్కొన్నారు. బ్రిటిష్ కు వ్యతిరేకంగా పోరాడి జైలు జీవితాన్ని కూడా గడిపాడని తెలిపారు. వీర సావర్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు. కార్యక్రమంలో మురళీ భట్టడ్, రవికుమార్ గౌడ్, అరవింద్, కడుదాస్ ప్రవీణ్, శ్రవణ్, మ్యాతరి ఆకాష్, చక్రి, భోగం అన్వేష్, గిరీష్, బాలరాజు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.