Take a fresh look at your lifestyle.

సంక్షేమ గృహాల విద్యార్థులకు మెరుగైన వసతులు

  • కలెక్టర్ అభిలాష అభినవ్.

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహల్లో విద్యార్థులకు ఉత్తమ విద్య, వసతులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు.బుధవారం ఖానాపూర్‌లోని ప్రభుత్వ గిరిజన బాల, బాలికల వసతి గృహాలను ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని నాణ్యమైన విద్యను అందించాలని అధికారులను ఆదేశించారు. పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులతో పాటు స్టడీ అవర్స్ నిర్వహించాలని సూచించారు. సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయాలని చెప్పారు. వంటగదిని పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించాలన్నారు. కూరగాయలు, వంట సామాగ్రిని పరిశుభ్రంగా నిల్వ ఉంచాలన్నారు. పాఠశాలల పరిసర ప్రాంతాల్లో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్యాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా, తక్షణమే మెరుగైన చికిత్స అందించాలన్నారు. రాత్రి వేళల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులకు అందుబాటులో ఉండాలన్నారు. ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ వసతి గృహాల్లో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోందని తెలిపారు. అధికారులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వసతి గృహాల్లో సమస్యలు తలెత్తిన వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం కలెక్టర్ భవిత కేంద్రంను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, మండల ప్రత్యేక అధికారి జీవరత్నం, తహసీల్దార్ సుజాత, ఎంపిడిఓ సునీత, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.