- వెంటనే ఆర్మూర్, కూసుమంచి ఎస్ ఆర్ వో కార్యాలయాల్లో అమలు.
- త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు.
- సాంకేతిక సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
- రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : అవినీతిరహితంగా , పారదర్శకంగా, సమయాన్ని ఆదా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 2వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకువస్తున్న నేపధ్యంలో ఆధార్ -ఈ సంతకం కూడా వీలైనంత త్వరగా అమలులోకి తీసుకువరావాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఆధార్ -ఈ సంతకంతో 10 నుంచి 15 నిముషాలలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు.సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ జ్యోతి బుద్ధప్రకాష్‌తో కలిసి స్లాట్ బుకింగ్ విధానం, పని భారం అధికంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనపు రిజిస్ట్రార్‌ల పోస్టింగ్, పదోన్నతి పొందిన ఉద్యోగులకు పోస్టింగ్‌లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ స్లాట్ బుకింగ్‌తో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంలో భాగంగా ఆధార్- ఈ సంతకం ప్రవేశపెడుతున్నామని చెప్పారు.ముందుగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఖమ్మం జిల్లా కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తక్షణమే అమల్లోకి తీసుకువస్తున్నామని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ తీసుకువస్తున్న నేపధ్యంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పఠాన్‌చెరు, యాదగిరి గుట్ట, గండిపేట, సూర్యాపేట, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అదనంగా ఎస్ ఆర్ వోలను నియమించినట్లు మంత్రి తెలిపారు.అయితే అవినీతికి తావులేకుండా ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ ప్రభుత్వ పేరు ప్రతిష్టలు పెంచేలా సబ్ రిజిస్ట్రార్‌ల పనితీరు ఉండాలని పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులకు సూచించారు.