ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతో ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయలయ్యాయి. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున గద్వాల మండలం వీరాపురం గ్రామ శివారులో చోటు చేసుకుంది. గద్వాల రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం పెంట్లవెల్లి గ్రామానికి చెందిన ఎండి ఇంతియాజ్, ఎండి ఇర్ఫాన్, హాజీ, ముజమిల్ ఆలీ నలుగురు వ్యక్తులు కలిసి గోవా టూర్ కి వెళ్లారు. గోవా టూర్ ముగించుకొని తిరిగి ప్రయాణంలో గద్వాల మీదుగా పెంట్లవెల్లికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో గద్వాల మండలం వీరాపురం గ్రామ శివారులో శ్రీ కృష్ణ స్వామి దేవాలయం సమీపంలో కారు డ్రైవర్ ఎండి ఇర్ఫాన్ నిద్ర మత్తు లోకి జారుకోగా ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. డ్రైవర్ పక్కన ముందు సీట్లో కూర్చున్న ఎండీ ఇంతియాజ్ (32)కు తలకు బలమైన రక్త గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గద్వాల ఆసుపత్రి కి తరలించగా, ఇంతియాజ్ మృతదేహాని పోస్టుమార్టానికి తరలించారు. పోలీసుల కేసు దర్యాప్తు చేస్తున్నారు.