Take a fresh look at your lifestyle.

మున్సిపల్ ఎన్నికలు ముగిసేలోపు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావును అరెస్ట్ చేయాలి

ప్రజాప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు
కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ల కుమ్మక్కు రాజకీయాలు
ఎవరెన్ని శాపనార్ధనాలు పెట్టినా మరో ఎనిమిదేళ్లు మాదే అధికారం
కాళేశ్వరం, ఈ కార్ రేసింగ్ కేసులపై చర్యలకు బీజేపీ అనాసక్తి
మున్సిపల్ ఎన్నికలు ముగిసేలోపు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావును అరెస్ట్ చేయాలి
వరంగల్, కరీంనగర్ జంట నగరాలుగా అభివృద్ధి 
బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ఆలయాల అభివృద్ధి
పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వని బీజేపీ అగ్రనేతలు ఇక్కడికి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు..?
ఎన్నికల ప్రచారానికి ముందు మోడి హామీల అమలు గురించి మాట్లాడాలి
చొప్ప‌దండి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి
ముద్ర, కరీంనగర్ :
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ… తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలది ఫెవికాల్ బంధమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఒకవేళ బీఆర్ఎస్, బీజేపీ బంధం నిజం కాకపోతే మున్సిపల్ ఎన్నికలు ముగిసేలోపు కాళేశ్వరం, ఈ కార్ రేసింగ్ కేసుల్లో కేసీఆర్‌, కేటీఆర్, హరీష్ రావును అరెస్ట్ చేయాలని సవాల్ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అవయవ దానం చేసి రాష్ట్రంలో బీజేపీని ఎనిమిది స్థానాల్లో గెలిపించిందని ఆరోపించారు. పదేళ్ల తమ పాలనలో రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్న బీఆర్ఎస్ నేతలు నిరుద్యోగులు, మహిళలు, రైతులు అందరినీ ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. ప్రజలు ఛీ కొట్టిన తర్వాత.. బుద్ధి తెచ్చుకుని పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోసం పని చేశారని విమర్శించారు. 2027 లో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయన్న సీఎం.. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ఆలయాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఎకో టూరిజంను అభివృద్ధి చేసి పర్యాటక క్షేత్రంగా తీర్చి దిద్దుతామని వెల్లడించారు. గురువారం క‌రీంన‌గ‌ర్ జిల్లా చొప్ప‌దండి మండలం  గుమ్లాపూర్ లో ఏర్పాటు చేసిన “ప్రజా పాలన- ప్రగతి బాట”బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. గతంలో పాలమూరుకు వచ్చిన ప్రధాని మోదీ పాలమూరు రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని ఇచ్చిన హామీని సీఎం గుర్తు చేశారు. రెండు రోజుల క్రితం్ అదే ప్రాంతానికి వచ్చిన జాతీయ అధ్యక్షుడు ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. కనీసం మెట్రో రైలు రెండో  విడత, కాళేశ్వరం విచారణపై మాట్లాడలేదని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన నిధుల ఊసు ఎత్తని బీజేపీ జాతీయ అధ్యక్షుడు.. ఏం మొహం పెట్టుకుని రాష్ట్రానికి ప్రచారానికి వచ్చారని నిలదీశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ ఎన్నికల్లో బీజేపీని ఒక్క సీటు కూడా గెలవనీయరని సీఎం శపధం చేశారు. పదేళ్లలో రాష్ట్రానికి బీఆర్ఎస్, పన్నెండు ఏళ్లలో దేశానికి బీజేపీ చేసిందేమీ లేదన్నారు. వారి పాలన కంటే తాము రెండున్నరేళ్లలో ఎక్కువే చేశామన్నారు. రెండేళ్ల తమ పాలనలో రాష్ట్రంలో 70 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఇందులో ఎవరికైనా అనుమానం ఉంటే.. ఎల్బీ స్టేడియానికి రావాలని సూచించారు. అక్కడే వివరంగా చెబుతా అని సవాల్ చేశారు. పదేళ్లు అందివచ్చిన అధికారాన్ని అవకాశాన్ని ఉపయోగించుకున్న బీఆర్ఎస్ నాయకులు రూ. వేల కోట్లు సంపాదించుకున్నారే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇప్పుడు పదేళ్ల తర్వాత ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే వాళ్లు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రానికి బీజేపీ చేసింది ఏమీ లేదని సీఎం విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు రాగానే.. జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చి ప్రచారం చేయిస్తున్నారని ఆ పార్టీ నేతలపై మండిపడ్డారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చాం.. ఈ ప్రాంత ప్రజలు మనకు ఓట్లు వేయరని కనీసం ఆ అధ్యక్షుడికైనా తెలియాలి కదా అని సెటైర్లు వేశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలని ఆరు నెలల క్రితమే అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు సీఎం చెప్పారు.  అయినా కేంద్రం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో రాష్ట్రప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరం కేసీఆర్  కు ఏటీఎంగా మారిందన్న ప్రధాని ఎందుకు సీబీఐ విచారణ చేపట్టలేదని నిలదీశారు.ఫార్ములా ఈ రేసు కేసులో ఐఏఎస్ అధికారిపై విచారణకు అనుమతి కోరుతూ లేఖ రాస్తే ఇప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు.  బీఆర్ఎస్ అక్రమాల గురించి స్వయంగా తానే నీలదీసిన ప్రధాని మోడీ.. అక్రమార్కులను ఎందుకు జైల్లో వేయడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిని ఒకరు రక్షించుకుంటూ రాజకీయాల్లో కొనసాగుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎన్ని శాపనార్ధాలు పెట్టినా మరో ఎనిమిదేళ్లు అధికారం తమదేనన్నారు. తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే వరకు అధికారంలో కొనసాగుతామని జోస్యం చెప్పారు. కరీంనగర్ కు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామన్న సీఎం.. వరంగల్, కరీంనగర్ జంట నగరాలుగా అభివృద్ధి చేసి రెండింటి మధ్యలో డంప్ యార్డు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ప్రకటించారు. బండి గుండు తెచ్చేదేం లేదు.. మోదీ ముందు మాట్లాడే ధైర్యం వాళ్లకు లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కు చురకలంటించారు. బండి సంజయ్ మాపై రంకెలేయడం కాదు.. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేసి కెసీఆర్ ను బొక్కలో వేయించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ నుంచి కరీంనగర్ మున్సిపల్ అభివృద్ధికి ఏం నిధులు తెచ్చారో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవ్వరు ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా తెలంగాణ అభివృద్ధి మాత్రం ఆగదన్నారు. ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని చెప్పారు.సీఎం హోదాలో రాష్ట్రాన్ని దోచుకుని అప్పుల పాలు చేసిన కేసీఆర్ అధికారం పోయిన వెంటనే ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో పడుకున్నారని ఆరోపించారు. ఆయన సడ్డకుని కొడుకు .. ఇసుకనే కాదు మిడ్ మానేరు ఇండ్లను కూడా వదల్లేదన్నారు. ఆడబిడ్డలు కట్టుకునే చీరల్లో కూడా గత ప్రభుత్వంలో కమిషన్లు తీసుకున్నారని సీఎం ఆరోపించారు. అదే తమ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం రెండేళ్లల్లో రూ. 9 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. రెండేళ్లలో రూ. 27 కోట్లు మహిళలకు రుణాలు అందించి వ్యాపారంలో ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామని వివరించారు. ప్రధాన ప్రతిపక్ష నేతలుగా చెప్పుకుంటోన్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్ మేడారం సమ్మక్క- సారలమ్మ దర్శనానికి రాలేదని విమర్శించారు. పేదోళ్ల దేవుళ్లను మొక్కేందుకు వాళ్లకు వారికి నామోషీ అన్నారు. ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సంక్షేమం, అభివృద్ధిని కాంక్షించే మంచి వారినే ఎన్నుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కరీంనగర్ కు మళ్లీ వస్తాననీ… మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకుందామని సీఎం చెప్పారు.
మూడేళ్ల అనతికాలంలో కాంగ్రెస్ సర్కార్… సన్నబియ్యం ఇస్తోందన్నారు. విద్యార్థులకు కాస్కొటిక్ ఛార్జీలు పెంచామనీ బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌లు తీసుకొచ్చామన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం, రైతులకు ఉచిత కరెంట్, రైతు బీమా, రైతు భరోసా, రైతు రుణమాఫీ, వరికి రూ.500 బోనస్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు ఇలా చెప్పుకుంటూపోతే అనేక పనులు చేసి చూపించామన్నారు. ఆడబిడ్డలకు ఇచ్చే బతుకమ్మ చీరల వ్యవహారంలోనూ బీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడ్డారని సీఎం ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో భార్యా, భర్తలు మాట్లాడుకునే ఫోన్లు కూడా విన్నారని ధ్వజమెత్తారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సినిమా తారలు.. ఎవరి ఫోన్లూ వదల్లేదన్నారు. మంది ఫోన్లు వినే వాడు మనిషేనా? అలాంటి మనుషులకు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేస్తే.. మన కళ్లలో మన వేలుతో పొడుసుకున్నట్లు ఉంటుందని అన్నారు. ఈ సభలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.