త్వరలోనే మూడు విభాగాలుగా హైదరాబాద్
హైదరాబాద్ సహా కొత్తగా శేరిలింగంపల్లి, మల్కాజిగిరి
త్వరలోనే ఉత్తర్వులు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
త్వరలోనే హైదరాబాద్ మహానగర పాలనలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. మరికొన్ని రోజుల్లో జీహెచ్ఎంసీ మూడు ముక్కలుగా మారనుంది. ప్రస్తుత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి గడువు ఫిబ్రవరి 10తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అదే రోజున జీహెచ్‌ఎంసీని మూడు భాగాలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నగరాన్ని హైదరాబాద్, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి అనే మూడు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించేందుకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఒకే సంస్థ
గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోంది. జనాభా పెరుగుదలతో పాటు నివాస ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలు, ఐటీ హబ్‌లు విస్తృతంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ పరిస్థితులకు అనుగుణంగా నగర పరిపాలనలో మార్పులు అవసరమన్న అభిప్రాయం ప్రభుత్వ స్థాయిలో బలపడింది. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న 27 మున్సిపాలిటీలను ఇప్పటికే జీహెచ్‌ఎంసీలో విలీనం చేశారు. ఈ చర్యతో ఒక దశలో జీహెచ్‌ఎంసీ దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా మారే పరిస్థితి ఏర్పడింది. అయితే విస్తారమైన పరిధిని ఒకే సంస్థ ద్వారా సమర్థంగా నిర్వహించడం సవాలుగా మారడంతో విభజనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన, వేగవంతమైన నిర్ణయాలు, పారదర్శక పరిపాలన సాధించడమే ప్రధాన లక్ష్యంగా జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది. ఈ మార్పు ద్వారా ప్రతి ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. పాలకమండలి గడువు ముగియనున్న ఫిబ్రవరి 10నే ఈ విభజనకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉండటంతో ఆ తేదీకి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాజధాని పరిధిలోని పోలీసు కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. అదే నమూనాలో మున్సిపల్ పరిధిని కూడా తిరిగి క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్లతో పాటు కొత్తగా ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ భౌగోళిక సరిహద్దులకు అనుగుణంగా కొత్త కార్పొరేషన్ల రూపకల్పన జరుగనుందని సమాచారం. ఈ విధానం వల్ల పోలీసు పరిపాలనకు మున్సిపల్ పరిపాలనకు మధ్య సమన్వయం మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
కొత్తగా కొన్ని ప్రాంతాలు
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో కోర్ సిటీ ప్రాంతాలు, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ప్రధాన ప్రాంతాలు చేరనున్నాయి. శేరిలింగంపల్లి పేరుతో ఏర్పడే కొత్త కార్పొరేషన్ పరిధిలో ఐటీ హబ్ ప్రాంతాలు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అభివృద్ధి చెందుతున్న కాలనీలు, ఫ్యూచర్ సిటీ ప్రాంతాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలో తూర్పు హైదరాబాద్ ప్రాంతాలు, మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని ప్రధాన నివాస ప్రాంతాలు చేర్చే అవకాశం ఉంది.
జీహెచ్‌ఎంసీ విభజనకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడిన తరువాత ఆరు నెలల లోపు కొత్త కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే ఆగస్టు 2026 నాటికి ఈ ఎన్నికలు జరగనున్న అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పరిపాలనకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందుగానే చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్‌తో పాటు అదనపు కమిషనర్లుగా సృజన, వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని సమాచారం. కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు సంబంధించిన పరిపాలనా ఏర్పాట్లు పూర్తయ్యాక ఈ నియామకాలపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. మొత్తంగా హైదరాబాద్ మహానగర పాలనలో ఈ విభజన ఓ కీలక మలుపుగా మారనుందని రాజకీయ, పరిపాలనా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.