మహాత్మా గాంధీ ఏ పాపం చేశారూ..?
ఉపాధి పథకంలో ఆయన పేరు తొలగించాల్సిన అవసరం ఏంటీ.?
ఆ పథకాన్ని తిరిగి తెచ్చే వరకు పోరాటం
బలమైన బ్రిటిష్ పాలకులు కూడా గాంధీని ముట్టుకోలేకపోయారు
దేశానికి చెందిన మతతత్వ శక్తులు ఆయన్ని కాల్చి చంపాయి
చెన్నై బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
చెన్నై :

కేంద్రంలో అధికారంలో మోడీ సర్కార్.. తెల్లదొరల కదంబ హస్తాల నుంచి దేశాన్ని విముక్తి కల్పించిన జాతిపిత మహాత్మా గాంధీ పేరును చరిత్ర నుంచి చెరిపేసే కుట్ర చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. మహాత్మగాంధీ ఏం పాపం చేశారని ఉపాధి హామీ పథకం నుంచి ఆయన పేరును తొలగించారని కేంద్రాన్ని ప్రశ్నించారు. గురువారం సాయంత్రం చెన్నై నగరంలో ఉపాధి హామీ పథకం నిబంధనలు మార్పు, ఉపాధి పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర, భారీ బహిరంగ సభలో భట్టి ప్రసంగించారు. ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసి ఆ పథకం కనిపించకుండా చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందన్న ఆయన ఈ చట్టంలో మహాత్మా గాంధీని పేరు తొలగించడంతో పాటు వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ గ్యారంటీ కల్పించాలన్న ఆత్మను సైతం తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని కోట్లాది మంది వ్యవసాయ కార్మికులు ఏం పాపం చేశారని ఉపాధి హామీ పథకంలో మార్పులు చేశారని నిలదీశారు. ప్రతి వ్యవసాయ సీజన్లో 50 పైసల కూలీ ధరల పెరుగుదల కోసం దేశవ్యాప్తంగా ఎన్నో ఆందోళనలు, పోలీసు లాఠీచార్జీలు, రక్తపాతం జరిగేవన్నారు. ఈ దారుణమైన పరిస్థితులను పారద్రోలాలన్న మానవీయకోణంతో యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో దేశంలోని కోట్లాదిమంది వ్యవసాయ కార్మికుల కోసం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్నిఈ దేశంలో తీసుకువచ్చారని తెలిపారు. చిన్న రక్తపాతం, ఎలాంటి ఆందోళనలు లేకుండా కూలీలకు వంద రోజుల పని గ్యారంటీ కల్పిస్తూ, ఉపాధి అనేది వ్యవసాయ కార్మికుల హక్కు అని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. ఈ పథకం దేశంలోని కోట్లాది వ్యవసాయ కార్మికుల జీవితాల్లో ఒక నిశ్శబ్ద విప్లవం అని అభివర్ణించారు. ఈ గొప్ప పథకం వ్యవసాయ కార్మికుల జీవితాలకు ఓ అర్థం తీసుకువచ్చిందన్న ఆయన ఉన్న ఊరిలోనే సంపాదిస్తూ ఆత్మగౌరవంతో వ్యవసాయ కూలీలు జీవించేందుకు మహాత్మా గాంధీ ఉపాధి పథకం తోడ్పడిందని తెలిపారు. ఇంతటి గొప్ప పథకాన్ని కనుమరుగు చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి పథకంలో అనేక మార్పులు తీసుకువచ్చిందని మండిపడ్డారు. చివరకు దేశ ప్రజలు మహాత్మునిగా పిలుచుకునే గాంధీ పేరును సైతం తొలగించిందని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ల పిలుపుమేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల పిసిసి కమిటీల ఆధ్వర్యంలో దేశంలోని కోట్లాది వ్యవసాయ కార్మికుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని బిజెపి ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించే వరకు వ్యవసాయ కార్మికుల పక్షాన దేశంలోని కోట్లాది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు అలుపెరగని పోరాటం చేస్తాయని స్పష్టం చేశారు. సామాన్యునికి ఇబ్బందులు వచ్చినప్పుడు తమిళనాడు ఎల్లప్పుడూ ముందు వరుసలో నిలబడుతుందన్న భట్టి.. ఇప్పుడు కూడా తమిళనాడు వ్యవసాయ కార్మికుల పక్షాన ముందు వరుసలో నిలబడటం అభినందనీయమన్నారు. 1915 నుంచి 1947 వరకు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ నాయకత్వంలో దేశంలో అనేక పోరాటాలు జరిగాయన్నారు. అయినా బలమైన బ్రిటిష్ సామ్రాజ్యం గాంధీని ముట్టుకునే సాహసం కూడా చేయలేక పోయిందని తెలిపారు. దురదృష్టం ఏంటంటే స్వాతంత్రం సిద్ధించిన ఆరు నెలల్లోనే మన దేశానికి చెందిన మత శక్తులు మహాత్మా గాంధీని పట్టపగలు తుపాకీ గుళ్ళతో కాల్చి చంపాయి అన్నారు. గాంధీజీ మనకు స్వేచ్ఛ, పెరియార్ ఆత్మగౌరవాన్ని, కామరాజు నిజాయితీని, అన్నా దురై మనకు గౌరవాన్ని ఇచ్చారన్నారు. ఈ వరసత్వానికి తగిన భవిష్యత్తు ను మన బిడ్డలకు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం, నైతిక కర్తవ్యం, చారిత్రాత్మక బాధ్యత అని డిప్యూటీ సీఎం తెలిపారు. సభలో తమిళనాడు పిసిసి అధ్యక్షుడు సెల్వ, ఏ సి సి సెక్రటరీ చోలాంకర్ జి తదితరులు పాల్గొన్నారు.