ముద్ర, హైదరాబాద్ :
ప్రధాని నరేంద్ర మోడీ సభ విజయవంతమైన సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కంటోన్మెంట్‌లోని గాయత్రి గార్డెన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 10 రోజులుగా సహకరించిన మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని సభకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు తరలివచ్చారని, సభా ప్రాంగణంలోనే కాకుండా బయట కూడా భారీగా జనసందోహం కనిపించిందన్నారు. ముఖ్యంగా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి ప్రజలు అత్యధికంగా హాజరయ్యారని పేర్కొన్నారు.
మేడ్చల్, సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మోర్చా నాయకులు, డివిజన్ స్థాయి కార్యకర్తలు, అపార్ట్మెంట్ అసోసియేషన్లు, నార్త్ ఇండియా సమాజం సహకారంతో సభ విజయవంతమైందని ఈటల తెలిపారు. ఈ సభ ద్వారా రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే సంకేతాలను ప్రధాని మోడీ ఇచ్చారని అన్నారు. తాను ఏడాది పొడవునా ప్రజలకు అందుబాటులో ఉంటానని, రాష్ట్రంలో ప్రజా సమస్యలను పట్టించుకునే ఏకైక పార్టీ బీజేపీనేనని పేర్కొన్నారు.
త్వరలో నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తామని ఈటల వెల్లడించారు. మోడీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ మరింత విస్తరించిందని, తెలంగాణలో కూడా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం అప్పుల ఊబిలోనుంచి బయటపడాలన్నా, రైతులు, విద్యార్థుల సమస్యలు పరిష్కారమవ్వాలన్నా బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
స్వదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచాలని, విదేశీ మారక ద్రవ్యం వృథా కాకుండా చూడాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని ఈటల తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ప్రభావంతో అమెరికాలో కూడా పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగాయని గుర్తుచేశారు. “మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా” లక్ష్యంతో మోడీ పనిచేస్తున్నారని అన్నారు.
అలాగే కేంద్ర నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించిన ఈటల.. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు నిధులు అడిగి, వెళ్లిన తర్వాత విమర్శించడం తగదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ గతంలో మోడీని ప్రశంసించి, తర్వాత విమర్శించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదని విమర్శించిన ఆయన, రాజకీయ నాయకులు మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు.