Take a fresh look at your lifestyle.

గ్రామాభివృద్ధిలో సర్పంచ్ లది కీలకపాత్ర

 

ప్రజా భాగస్వామ్యంతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి

నూతన సర్పంచ్ ల శిక్షణా ముగింపు కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సూచన

(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి):

గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ ల పాత్ర కీలకమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. పంచాయతీ రాజ్ చట్టాలు నిర్ధేశించిన విధులు, బాధ్యతలు, అధికారాలపై సరైన అవగాహన పెంచుకొని గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సర్పంచ్ లకు సూచించారు. శనివారం ముచ్చింతల్ స్వర్ణ భారతి ట్రస్టులో
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని 4 మండలాలు, రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల నూతన సర్పంచ్ లకు శిక్షణా ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు బాధ్యతలు విధులను విస్మరించరాదన్నారు. గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర అత్యంత కీలకమన్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవలన్నారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే రంగారెడ్డి సూచించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసిన సర్పంచ్‌లకు సర్టిఫికెట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ మాట్లాడుతూ.. పంచాయతీ పరిపాలన, ఆర్థిక నిర్వహణ, ఉపాధి హామీ పథకం అమలు తదితర అంశాలపై సర్పంచ్ లు పూర్తిగా అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ సమగ్ర మార్గదర్శకాల గురించి వివరించారు. నూతన సర్పంచ్ ల శిక్షణా కార్యక్రమంలో శిక్షకులుగా ముగ్గురు డీఎల్పీవోలు, ఇద్దరూ ఎంపిడీవోలు, ఇద్దరూ ఎంపీవోలు, ఒక ఈజీఎస్ ఈసీ, టీఎలు పాల్గొని శిక్షణను సమర్థవంతంగా నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.