- మావోయిస్టు కేంద్రకమిటీ పిలుపు.
- 27 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా బంద్.
- జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : వరుస ఎన్ కౌంటర్లతో కోలుకోలేని దెబ్బతిన్న మావోయిస్టు కేంద్ర కమిటీ ఈ నెల 10న భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర సాయుధ బలగాలు మావోయిస్టుల అగ్రనేత నంబాల కేశవరావు మరో 27 మంది ‘మావో’లను ఎన్‌కౌంటర్ చేసినందుకు నిరసనగాఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.ఈ మేరకు మావోయిస్టు కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట శనివారం ఓ లేఖ విడుదల అయింది.అందులో అభయ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2024 నుంచి ఇప్పటి వరకు ఎన్ కౌంటర్ పేరిట 540 మంది మావోయిస్టులను పొట్టనబెట్టుకుందని ఆరోపించారు.ఆపరేషన్ కగార్ ప్రారంభం ముందు నుంచి రెండు నెలల పాటు తాము సంయమనం పాటించినట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్రాల ఫాసిస్ట్ వైఖరికి నిరసనగా బంద్ కు పిలుపునిచ్చినట్లు వివరించారు.ఈ బంద్ లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.శాంతి చర్చలకు తాము సిద్ధమని ప్రకటించినా కేంద్రం ఆపరేషన్ కగార్ ఆపడంలేదని మండిపడ్డారు.