Take a fresh look at your lifestyle.

రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక గోశాలలు

  • ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయండి.
  • నిర్ణీత గడువులోగా నివేదిక సిద్ధం చేసి అందేలా చూడాలి.
  • గోశాలల నిర్వహణ, సంరక్షణ విషయంలో ధార్మిక సంస్థల భాగస్వామ్యంపై ఆలోచించండి.
  • అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలను ఏర్పాటు చేయడానికి సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.గోశాలల ఏర్పాటుకు సంబంధించి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు నిర్ణీత గడువులోగా ఆ కమిటీ నివేదిక రూపొందించేలా చర్యలు తీసుకోవాలని కీలక సూచనలు చేశారు.రాష్ట్రంలో గోశాలల ఏర్పాటు, నిర్వహణ, సంరక్షణ, అభివృద్ధి వంటి అంశాలపై శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గోశాలల నిర్మాణం, నిర్వహణ, సంరక్షణ కోసం పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాలు రూపొందించాలని చెప్పారు. గోసంరక్షణ, వాటి నిర్వహణ సులువుగా ఉండేందుకు వీలుగా గోశాలల ఏర్పాటు జరగాలని చెప్పారు. మొదటి దశలో రాష్ట్రంలోని వెటర్నరీ యూనివర్సిటీ, కళాశాలలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, కళాశాలలు, దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలన్నారు. గోశాలల ఏర్పాటు కోసం అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని, కనీసం 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.బంధించినట్టుగా ఇరుకు స్థలాల్లో కాకుండా మేతకు, స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా ఉండాలన్నారు. గోశాలల నిర్వహణ, సంరక్షణ విషయంలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించి పలు డిజైన్లను సీఎం పరిశీలించారు. షెడ్ల నిర్మాణం, ఇతర డిజైన్లలో అవసరమైన పలు మార్పులను అధికారులకు సూచించారు.మరో నాలుగైదు రోజుల్లోగా తుది మోడల్‌ను ఖరారు చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షలో సీఎంఓ అధికారులు శేషాద్రి, శ్రీనివాసరాజు, మాణిక్ రాజ్, అజిత్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్, హెచ్ఎం ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, పశుపోషణ విభాగం డైరెక్టర్ బి.గోపి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.