- డ్రగ్స్ (మందుల) కొరత ఉంటే వెంటనే తెలియజేయాలి.
- జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.
- ఆసుపత్రిలో అపరిశుభ్రతపై జిజిహెచ్ సూపర్ డెంట్ పై సీరియస్.
ఖమ్మం, ముద్ర విలేకరి: జిల్లా కేంద్రంలోని ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) లో పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు ఆలస్యంగా అవటంతో సమ్మె బాట పట్టడంతో ఆసుపత్రిలో పారిశుద్ధ్య లోపించింది. ఆసుపత్రిలో ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలు ఉండటంతో ఆసుపత్రి కంపు కొడుతోంది. దీంతో బుధవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి , అడిషనల్ కలెక్టర్ డాక్టర్ శ్రీజతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రి లోపల వచ్చిన తర్వాత అక్కడ ఆసుపత్రి సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఎవరు లేకపోవడంతో ఆయనే స్వయంగా లోపలికి వెళ్లారు. ఆసుపత్రిలో ఎక్కడపడితే అక్కడ అపరిశుభ్రంగా ఉండడంతో సూపరింటెండెంట్ పై సీరియస్ అయ్యారు.పారిశుద్య కార్మికులకు వేతనాల చెక్కులు వచ్చిన ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.టాయిలెట్స్, డయాలసిస్ వార్డు, ఫార్మసీ స్టోర్, జనరల్ వార్డు, కిచెన్ లను తనిఖీ చేసి, ఆసుపత్రిలోని రోగులతో కలెక్టర్ మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పురుషుల మెడికల్ వార్డు లో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.ఎప్పుడు,ఏ ఇబ్బందితో ఆసుపత్రికి వచ్చింది, డాక్టర్లు చూశారా, మందులు ఇచ్చారా, పరీక్షలు చేస్తున్నారా, నర్సులు, సిబ్బంది సేవలపై రోగులను అడిగి కలెక్టర్ ఆరా తీశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మనం మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆసుపత్రి ప్రాంగణం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుద్ద్యం అంశంలో ఎటువంటి లోటుపాట్లు ఉండటానికి వీలు లేదని, అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ఫార్మసీ స్టోర్ లో అన్ని రకాల డ్రగ్స్ ( మందులు) అందుబాటులో ఉండాలని, ఏ డ్రగ్ స్టాక్ చివరికి వచ్చినా లేఖ రాసి వదిలేయకుండా వెంటనే తన దృష్టికి తీసుకొని రావాలని, వైద్య శాఖ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు ఫాలో అప్ అవుతూ ఆసుపత్రిలో మందుల స్టాక్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆసుపత్రిలో కిచెన్ విభాగంపై ఫిర్యాదులు రాకుండా చూడాలని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం రుచి, శుచికరమైన ఆహారం అందించాలని, ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆసుపత్రిలో ఉన్న ల్యాబ్ ద్వారా అవసరమైన రోగులకు రెగ్యులర్ గా నిర్ధారణ పరీక్షలు జరపాలని, పరీక్ష ఫలితాలను సకాలంలో అందించాలని అన్నారు. పరీక్షల రిజిష్టరు ను పరిశీలించి, ఏ ఏ పరీక్షలు చేపడుతున్నది, ఫలితాలు ఇస్తున్న వివరాలు పరిశీలించారు. పరీక్షల కిట్ల లభ్యతను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు ఎటువంటి పరీక్షల నిమిత్తం రాయవద్దని కలెక్టర్ తెలిపారు. సమయపాలన పాటించాలని, అనుమతి లేకుండా గైర్హాజరు కారాదని అన్నారు.ఈ ఆకస్మిక తనిఖీ సమయంలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఎల్. కిరణ్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ డా.బి. కిరణ్ కుమార్, ఆర్ఎంఓ డా. రాంప్రసాద్, డా. రాంబాబు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
