Take a fresh look at your lifestyle.

కరీంనగర్‌లో బీజేపీ–బీఆర్‌ఎస్ “ఫెవికాల్ బంధం”

– వైద్యుల అంజన్ కుమార్ ఆరోపణలు

కరీంనగర్, ముద్ర:
కరీంనగర్ నగరపాలక సంస్థలో ఇటీవల జరిగిన మేయర్ ఎన్నికలు, కో-ఆప్షన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందం బయటపడిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైద్యుల అంజన్ కుమార్ ఆరోపించారు. ఈ ఎన్నికలు రెండు పార్టీల మధ్య ఉన్న అంతర్గత అనుబంధానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

మేయర్ ఎన్నికల్లో బీజేపీకి సరైన కోరం లేకపోయినా, బీఆర్‌ఎస్ మద్దతుతో అది సాధ్యమైందని ఆయన విమర్శించారు. కో-ఆప్షన్ ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు బీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా రెండు పార్టీల మధ్య ఉన్న అనుబంధం స్పష్టమైందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరించిందని, ప్రజల ముందు బీజేపీ–బీఆర్‌ఎస్ గుట్టును బయటపెట్టాలనే ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తాము ఊహించినట్టుగానే రెండు పార్టీల వ్యవహారం బహిర్గతమైందని చెప్పారు.

బీజేపీకి 34 మంది సభ్యులు ఉన్నప్పటికీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్‌ఎస్ సభ్యులను ప్రలోభపెట్టి మద్దతు పొందారని ఆరోపించారు. బయటకు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, లోపల మాత్రం ఒప్పంద రాజకీయాలు నడిపిస్తున్నారని విమర్శించారు.

మున్సిపల్ చట్టానికి విరుద్ధంగా కో-ఆప్షన్ పదవులు ఇచ్చినట్టు ఆరోపిస్తూ, బీజేపీ నిజాయితీపై ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజలను మభ్యపెట్టే డ్రామా రాజకీయాలు చేస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

ప్రజలు ఈ రాజకీయాలను గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన తీర్పు ఇస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చే ప్రయత్నాలు ఫలించవని, ప్రజల మద్దతు ఉన్నంతకాలం ఇలాంటి కపట రాజకీయాలు సాగవని వైద్యుల అంజన్ కుమార్ స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.