Take a fresh look at your lifestyle.

మంత్రులు, ఐఏఎస్‍ల అవినీతి భయపెడతాం -కేంద్ర మంత్రి బండి సంజయ్

బీజేపీని అడ్డుకోవాలని చూస్తే మీ సంగతి చూస్తాం
మంత్రుల అవినీతికి మధ్యవర్తులుగా కొందరు ఐఏఎస్ లు
భాగ్యనగర్‍ ప్రజలు కాంగ్రెస్‍ను మూసీ లో పడేయడం ఖాయం

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలో పలు శాఖల మంత్రుల అవినీతిపై ఆధారాలు సేకరిస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2029 నాటికి దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పాలన ఉండదన్న ఆయన.. మంత్రి పదవులను అడ్డుపెట్టుకుని బరితెగించి బీజేపీని అడ్డుకోవాలని చూస్తే మీ సంగతి చూస్తామని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నేతలను ఇబ్బంది పెట్టిన మంత్రుల మెడలు వంచుతామన్నారు. మంత్రుల అవినీతికి కొందరు ఐఏఎస్ అధికారులే మధ్యవర్తులుగా ఉన్నారన్న బండి సంజయ్… అతి త్వరలో మంత్రుల కమీషన్ల చిట్టా, ఐఏఎస్ అధికారుల దందాలన్నీ బయటపెడతామన్నారు. 2029 తర్వాత 2047 వికసిత్ భారత్ లక్ష్యాలు నెరవేరేదాకా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే కొనసాగుతోందన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‍కు చెందిన 10 డివిజన్ కార్పొరేటర్ గురువారం నాంపల్లిలోనీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్టేట్ చీఫ్ రామచందర్ రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)ని తెలంగాణ కరప్షన్, కమీషన్, కలెక్షన్, కాంగ్రెస్ (టీ4సీ) గా అభివర్ణించారు. భాగ్యనగర్‍లో కాంగ్రెస్‍ను మూసీ నదిలో పడేయడం ఖాయమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగ్యనగర్ ప్రజలు కాంగ్రెస్ కు దిమ్మతిరిగేలా గుణపాఠం చెప్పబోతున్నారని జోస్యం చెప్పారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను రెండేళ్లలో చేసిందేమిటో చెప్పాలని నిలదీయాలని నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు మూటలు అప్పగించడానికే పరిమితమవుతున్నారే తప్ప తెలంగాణకు చేసిందేమిటో చెప్పాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల బెన్ ఫిట్స్ ఇవ్వకుండా వారి ఉసురు తీసుకుంటున్నారని ఇదేమిటని ప్రశ్నిస్తున్న వృద్ధులను జైల్లో వేయడానికి సిగ్గు లేదా? అని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పని చేశాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసిన కరీంనగర్ ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ చెంప చెళ్లుమనిపించారన్నారు. సీఎం స్థాయి వ్యక్తులు కరీంనగర్ కార్పొరేషన్‍లో కుట్రలు చేశారని.. సభ్యులకు బ్లాంక్ చెక్కులు, కార్లు ఆఫర్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పెద్దలు, బీఆర్ఎస్ పెద్దలు ఈ కుట్రలో భాగమయ్యారని ధ్వజమెత్తారు.

ఓవైసీ కళ్లలో ఆనందం కోసమే జీహెచ్ఎంసీ పునర్విభజన
ఎంఐఎం అధినేత అసదొద్దీన్ ఓవైసీ కళ్లల్లో ఆనందం చూడటం కోసం సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, అఖిలపక్షం మీటింగ్ లేకుండా, ప్రజాప్రతినిధుల అభిప్రాయం లేకుండా ఏకపక్షంగా జీహెచ్ఎంసీని విభజించడం సిగ్గు చేటని మండిపడ్డారు. జీహెచ్ఎంసీని మూడు ముక్కలు ఎందుకు చేశారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. జీహెచ్ఎంసీలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్న ఆయన బీజేపీకి భయపడే హిందూ సమాజ ఓట్లను చీల్చడానికే జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేశారని ఆరోపించారు. కోటిన్నర జనాభా కలిగి ఉండి 40 వేల కోట్ల బడ్జెట్ కలిగిన ముంబై కార్పొరేషన్ నే అక్కడి ప్రభుత్వం విభజించలేదని చెప్పారు. రెండు కోట్ల జనాభా కలిగిన ఢిల్లీని, చెన్నై కార్పొరేషన్ ను చీల్చలేదన్నారు. మరి జీహెచ్ఎంసీని ఏ ప్రాతిపదికన ముక్కలు చేశారని ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో జీహెచ్ఎంసీ పరిధిలో తట్ట మొరం పోసిన దాఖలాల్లేవన్నారు. భాగ్యనగర్ ప్రజలంతా తిరగబడే రోజులు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. తెలంగాణ రైజింగ్ పేరుతో వచ్చిన రూ.5.75 లక్షల కోట్లు ఎటుపోయాయని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. వచ్చిన డబ్బుతో ఎంత మందికి ఉద్యోగాలిచ్చారు? ఎన్ని యూనిట్లు ప్రారంభించారు? సమాధానం చెప్పాలన్నారు. దావోస్ కు రెండు సార్లు వెళ్లి రూ.2.15 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటి వరకు ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయని ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.