ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ డా.జి.జానకి షర్మిల తెలిపారు. ఈ మేరకు గంజాయి వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గాంజాగస్తీవికార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌హెచ్‌ఓ లు, పోలీస్ సిబ్బంది కిరాణా దుకాణాలు, పాన్ దుకాణాలు, అనుమానాస్పద ప్రదేశాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ప్రజలకు గంజాయి వాడకం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు, యువత భవిష్యత్తును దెబ్బతీస్తుందని వివరించారు. ముఖ్యంగా యువత గాంజా వంటి మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల విక్రయం, వినియోగంపై సమాచారం తెలిసినట్లయితే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ డా.జి.జానకి షర్మిల తెలిపారు.