Take a fresh look at your lifestyle.

ఆలయాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటాం- రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

 

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటన ఈ నెల 6న జరగనున్న సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్, రాష్ట్ర ఉర్దూ ఆకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ లతో కలిసి బాసరలో ఏర్పాట్లను పరిశీలించారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి, ముఖ్యమంత్రి ఆలయంలో పూజలు నిర్వహించే ప్రాంతం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసే ప్రాంతాలు పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అనంతరం ఆలయ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బాసర ఆలయ అభివృద్ధికి చిత్తశుద్ధితో ఉందని అన్నారు. బాసర తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాలు అన్ని అభివృద్ధి చేయనుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 6న ముఖ్యమంత్రి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా, దర్శనాలు సౌకర్యవంతంగా పూర్తయ్యేలా తగిన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి బాసర పర్యటనకు అధికారులంతా సమన్వయంతో పని చేసి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ఆలయ ఈవో విజయరామారావు, తహసిల్దార్ పవన్ చంద్ర, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.