Take a fresh look at your lifestyle.

ఎస్సైలుగా పదోన్నతి పొందిన నరసింహారెడ్డి, అబ్దుల్ ఖయ్యూం‌కు ఎస్పీ అభినందనలు

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు ఏఎస్ఐలకు ఎస్సై హోదాకు పదోన్నతి లభించింది. సిద్దాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న నరసింహారెడ్డి, పెంట్లవెల్లి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్న అబ్దుల్ ఖయ్యూం ఇటీవల సబ్ ఇన్స్పెక్టర్లుగా (ఎస్సై) ప్రమోషన్ పొందారు.

ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ వారికి అభినందనలు తెలియజేశారు. తన చేతుల మీదుగా హోదాకు సంబంధించిన స్టార్స్ అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, బాధ్యతాయుతంగా సేవలందించినప్పుడే ప్రజల్లో పోలీసులపై గౌరవం, విశ్వాసం పెరుగుతుందని అన్నారు. పదోన్నతి అనేది కేవలం ఉన్నత హోదా మాత్రమే కాకుండా, మరింత బాధ్యతను తీసుకురావడం కూడా అవుతుందని పేర్కొన్నారు.

ప్రతి పోలీస్ సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడి సమస్యను సానుభూతితో విని, వారికి తక్షణ సహాయం అందించడంతో పాటు న్యాయం జరిగేలా కృషి చేయాలని సూచించారు.

ప్రత్యేకంగా మహిళలు, పిల్లలు, నిరుపేదలు వంటి బలహీన వర్గాలకు పోలీసులు అండగా నిలవాలని ఎస్పీ పేర్కొన్నారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణ, నిజాయితీ, సేవాభావం వంటి విలువలను పాటిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకోవాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.