Take a fresh look at your lifestyle.

సెల్ టవర్‌కు వ్యతిరేకంగా ఆందోళన తీవ్రం

 

ముద్ర కాప్రా:

చర్లపల్లి ఈసీ నగర్ కాలనీలో కమ్యూనిటీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్‌ను వెంటనే తొలగించాలని కాలనీవాసులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా కాలనీవాసులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ మధ్యలో సెల్ టవర్ ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్ ప్రభావంతో అనారోగ్య సమస్యలు పెరుగుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సమీపంలో పార్క్ ఉండటంతో అక్కడికి వచ్చే వృద్ధులు, చిన్నారులు రేడియేషన్ ప్రభావానికి ఎక్కువగా గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. పాఠశాలలకు వెళ్లే పిల్లలు, గర్భిణీ స్త్రీలు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని వారు వివరించారు. అనుమతులు ఎలా ఇచ్చారు, ఎవరి ఒత్తిడితో టవర్ ఏర్పాటు జరుగుతోందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యం కంటే ప్రైవేట్ సంస్థల లాభాలను ముందుకు పెట్టడం తగదని మండిపడుతూ, వెంటనే పనులను నిలిపివేసి టవర్‌ను తొలగించాలని కోరారు. లేకపోతే నిరసనలను మరింత ఉధృతం చేసి పెద్ద ఎత్తున రహదారి నిరోధాలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కడియాల జనార్ధన్, లక్ష్మారెడ్డి, కడియాల రాకేష్, కొమ్ము రమేష్, ఫ్రాంచెస్, మొగులయ్య, సురేష్, కడియాల ప్రణయ్, విజయలక్ష్మి, రితతో పాటు పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.