ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను పక్కగా అమలు చేయాలని జిల్లా అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాలు
(ముద్ర, ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా ప్రతినిధి):
అన్ని వర్గాల సంక్షేమానికై రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణను అమలు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు.
మంగళవారం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక అమలు పై జిల్లా కలెక్టర్ సి,నారాయణా రెడ్డి, జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపిడిఒలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో పారిశుద్ధ నిర్వహణ విధిగా చేపట్టాలని, అదే విధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఫైళ్ల పరిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. సమస్యలు లేని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఉగాది సందర్భంగా సామూహిక గృహప్రవేశాలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా చివరి దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను వేగవంతం చేసి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు. గ్రౌండింగ్ కానీ పనులు గ్రౌండింగ్ చేసి పూర్తి అయ్యేలా చూడాలని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, జనన మరణ ధృవీకరణ పత్రాలు వంటివి ఏ ఒక్క ఫైల్ కూడా పెండింగ్ లేకుండా నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట మరమ్మత్తులు, పెయింటింగ్ పనులు చేపట్టాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఏ ఒక్క అధికారి కూడా నిర్లక్ష్య ధోరణి అవలంభించకుండా పని చేయాలని, వీధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆదేశించారు. థీమ్ నోడల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు వేగవంతం అయ్యే విధంగా చూడాలన్నారు. వేసవి మొదలైన సందర్బంగా జిల్లాలో ఎక్కడ కూడా నీటికి ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలకు అన్నీ ఏర్పాట్లు చేయాలని పరీక్ష కేంద్రంలో అన్నీ మౌలిక సదుపాయాలు ఉండేలా చూడాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్ఓ సంగీత, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.