ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ కలెక్టరేట్ నుంచి ఎంపీ గోడం నగేష్, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖలకు కేటాయించిన పనులన్నీ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, పెండింగ్ ఫైల్స్ పరిష్కారం, వైద్యారోగ్య కార్యక్రమాలు, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన, అరైవ్ అలైవ్ కార్యక్రమం, తదితర కార్యక్రమాలన్నీ ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని అన్నారు. అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల సంయుక్త భాగస్వామ్యంతో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణను స్వయంగా పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు. సంబంధిత శాఖల అధికారులు అందరూ తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాలలో పాల్గొనాలని తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య, వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, నిర్మల్, భైంసా ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు సోమ భీమ్ రెడ్డి, షిండే ఆనంద్ రావు పటేల్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.