Take a fresh look at your lifestyle.

ప్రజా ప్రగతి సాధించాలి – ఇంచార్జి మంత్రి దామోదర రాజనర్సింహ

……………………………………
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
…………………………………….
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన లో ప్రజలు అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలని జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన మూడో విడుత ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకు అధికార యంత్రాంగం ప్రభుత్వ పథకాల గురించి సమాచారం ఇవ్వడం ప్రాథమిక నిబంధన అని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 99 రోజుల పాటు నిర్వహించనున్న ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు.మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతంతో గ్రామ సభలు ప్రారంభించన అనంతరం ముఖ్యమంత్రి సందేశాన్ని పది నిమిషాల పాటు గ్రామ సభలో ప్రదర్శించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. పది ప్రధాన అంశాలతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పదేళ్లు బీ ఆర్ ఎస్ పాలన లో ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగిందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ పథకాలను మరింత సమర్థంగా అమలు చేయవచ్చని అన్నారు. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.గత ప్రభుత్వం అమలు చేసిన మిషన్ భగీరథ పథకంలో నాణ్యతా లోపాలు ఉన్నాయని, వాటి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమస్యలు తలెత్తిన తరువాత స్పందించడం కాకుండా ముందుగానే సమస్య ల నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులు,ఉపాధ్యాయుల నిష్పత్తిని పరిశీలించి, ఉపాధ్యాయుల కొరత ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు.అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సంక్షేమ పథకాల అమలులో అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి,, మహబూబ్‌నగర్ మేయర్ గుమాల మమత , డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత, వివిధ జిల్లాల కలెక్టర్లు అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.