Take a fresh look at your lifestyle.

ఘనంగా స్వర్ణగిరిలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తిరుప్పావడ సేవ

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో గురువారం సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తిరుప్పావడ సేవ ఘనంగా
నిర్వహించారు. సుప్రభాతసేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించారు. నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో సువర్ణ బిందె తీర్ధమును బంగారుబావి నుండి తీసుకువచ్చారు. అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య సుగంధ భరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. మని మయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళభరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి వేయి నామాల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు.
దివ్య క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనం, సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడం. స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ అంటారని ఆలయ ప్రధాన అర్చకులు దిట్టకవి శ్రవణాచార్యులు తెలిపారు. సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని, లడ్డు, వడ, తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు. వేదమంత్రోచ్ఛారణలతో అర్చించి కర్పూరమంగళ హారతులు సమర్పించారు. స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆనంద పరవశులైనారు.
ప్రతిరోజు స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
సాయంత్రం 6:30 కు ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు.
తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు.భక్తులు నయనానందకరంగా శ్రీవారినీ దర్శించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.