Take a fresh look at your lifestyle.

బీజేపీకి కొత్త సారధి..

  • ఈటల రాజేందర్‌కే అధ్యక్ష బాధ్యతలు.
  • రేపో మాపో అధికారిక ప్రకటన.
  • ఏకాభిప్రాయంతో ఈటల వైపే మొగ్గు చూపిన అధిష్టానం.
  • రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగల సత్తా ఈటలకు ఉంది.
  • బీసీ వర్గాలను సొంతం చేసుకోవడమే లక్ష్యం.

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ బీజేపీ అధ్యక్ష పగ్గాలు ఎవరికి కట్టబెట్టాలనే విషయంలో అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో కమలనాధులు చేస్తున్న కసరత్తు ఒక కొలిక్కి వచ్చేంది.రేపో మాపో కొత్త అధ్యక్షుడిని ప్రకటన చేసే అవకాశముంది. బీసీ వర్గానికి చెందిన మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కే అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వారితో పోలిస్తే వివాద రహితుడిగా, రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం ఉన్నఈటల రాజేందర్ బెటర్ అని కాషాయ పెద్దలు భావిస్తున్నారు.ఎంపీ ఈటల రాజేందర్‌కు ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్, సుదీర్ఘ రాజకీయ అనుభవం, బీజేపీ వ్యవహారాల తెలంగాణ ఇన్ చార్జ్ సునీల్ భన్సల్ ఇక్కడ పార్టీ నేతలతో కీలక చర్చలు జరపడం వంటి చాల కారణాల నేపథ్యంలో చివరికి ఏకాభిప్రాయంతో ఈటల వైపే అధిష్టానం మొగ్గుచూపింది. తెలంగాణలో బీజేపీ బీసీ మంత్రాన్నే నమ్ముకుంది. గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదం కలిసిరాకపోయినప్పటికీ , బీసీ వర్గాన్ని సొంతం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అధిష్టానం దాదాపు ఈటల రాజేందర్‌కే పార్టీ పగ్గాలు అప్పగించాలని ఫిక్స్ అయ్యింది. గతంలోనే ఈటలకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని కేంద్రమంత్రి అమిత్ షా కూడా హామీ ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కనుమరుగైతే తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుందనే అంచనాలతోనే మాస్ ఇమేజ్ ఉన్న ఈటల రాజేందర్‌కు పగ్గాలు అప్పగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేయగలరని అధిష్టానం భావిస్తోంది.అలాగే ఈటలకే పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఉద్యమ సంబంధాలు, సామాజిక బలం తోడై పార్టీకి మరింత కలిసొచ్చే అంశాలుగా బీజేపీ లెక్కలు వేసుకుంటుంది. 2003లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఈటల రాజేందర్ , 2004 నుంచి కమలాపూర్, హుజురాబాద్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంలోని కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్ధికశాఖ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2021లో టీఆర్ఎస్ అధిష్టానానికి తనకు వచ్చిన విభేదాలతో పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్, గజ్వేల్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన ఈటల రెండు చోట్ల ఓడిపోయారు. అనంతరం 2024 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందారు.

Leave A Reply

Your email address will not be published.