Take a fresh look at your lifestyle.

కౌన్సిల్​ సమావేశం రచ్చ రచ్చ … మేయర్​ పైకి బడ్జెట్​ ప్రతులు విసిరిన విపక్షాలు 

  • పలుమార్లు సభకు అంతరాయం 
  • ప్రజా సమస్యలు చర్చించిన తర్వాతే బడ్జెట్​ పెట్టాలన్న విపక్ష కార్పొరేటర్లు 
  • బడ్జెట్​ కే ప్రాధాన్యత ఇచ్చిన మేయర్​ 
  • విపక్ష కార్పొరేటర్ల అభ్యంతరం
  • బీఆర్​ఎస్​ సభ్యుల సస్పెండ్​ 
  • పోడియం వైపు దూసుకువచ్చిన కార్పొరేటర్లు 
  • బీఆర్​ఎస్​ కార్పొరేటర్ల అరెస్ట్​ 
  • అరెస్ట్​ ను ఖండించిన కేటీఆర్​
  • రూ.8440 కోట్ల బడ్జెట్ కు పాలక మండలి ఆమోదం
ముద్ర, తెలంగాణ:- గ్రేటర్ బల్దియా పాలకమండలి సమావేశం  రసాభాసగా మారింది. పలుమార్లు సభలో గందర గోళం నెలకొంది. విపక్ష సభ్యులు రచ్చ…రచ్చ చేశారు. సమావేశాన్ని పూర్తిగా హైజాక్ చేయాలని విపక్ష సభ్యులు …వారిపై పైచేయి సాధించాలని  అధికార కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు యత్నించారు. దీంతో సభ లో అధికార, విపక్ష కార్పొరేటర్ల మధ్య పలుమార్లు వాగ్వివాదం  చోటుచేసుకుంది.  ఇరువర్గాలు ఆరోపణలు…ప్రత్యారోపణలు చేసుకోవడంతో సభలో పలుమార్లు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక  దశలో అయితే మేయర్ పోడియం వైపుకు విపక్ష పార్టీలకు చెందిన కార్పొరేటర్లు ముకుమ్మడిగా దూసుకువచ్చారు. బడ్జెట్ ప్రతులను చించి మేయర్ పై విసిరివేసే ప్రయత్నం చేశారు. దీనిని కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో సభ జరుగుతున్నంత సేపు  గందరగోళం నెలకొంది. సభ్యుల నిరసనల మధ్య మేయర్  2025..2026 వార్షిక సంవత్సరానికి రూ. 8440 కోట్లతో ప్రవేశపెట్టిన  బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. దీనికి బీఆర్ఎస్ కు చెందిన కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభలో వీరంగం సృష్టించే ప్రయత్నం చేశారు. వెంటనే మార్షల్స్  రంగ ప్రవేశం  చేశారు. ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేశారు.  అనంతరం మేయర్ సభను నిరవధిక వాయిదా వేశారు.
రానున్న ఆర్ధిక సంవత్సరం (2025…2026) కోసం రూపొందించిన బడ్జెట్ కు ఆమోదం తెలపడం కోసం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది. అయితే సమావేశం మొదలైన పది నిమిషాల్లోనే  సభలో  గందరగోళం ఏర్పడింది. ముందుగా బడ్జెట్ ప్రవేశపెడుతామని, అందుకు సభ్యులంతా ఆమోదం తెలపాలని మేయర్ కోరారు.  దీనికి బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్పొరేటర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్ పై చర్చ లేకుండా ఏ విధంగా ఆమోదిస్తారని ప్రశ్నించారు. ముందు ప్రజా సమస్యలపై మాట్లాడాలని రెండు పార్టీల సభ్యులు పట్టుబట్టారు. ప్లకార్డులు పట్టుకుని మేయర్ పోడియం వద్దకు వచ్చిన బీఆర్‌ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు.అధికార పార్టీకి చెందిన  కార్పొరేటర్లు సీఎన్‌ రెడ్డి, బాబా ఫసియుద్దీన్ తదితరులు బీఆర్‌ఎస్ సభ్యుల నుంచి ప్లకార్డులను లాక్కొని చించేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్పొరేటర్లు ఒకరినొకరు తోసేసుకున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్‌ పోడియాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే వీరిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా యత్నించారు. దీంతో కౌన్సిల్ సమావేశంలో రసాభాస మొదలై అధికార, ప్రధాన ప్రతిపక్ష కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బడ్జెట్ కంటేముందు ప్రశ్నోత్తరాల కోసం బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబట్టారు. అయినా మేయర్ వెనక్కి తగ్గకపోవడంతో సభలో  విపక్ష కార్పొరేటర్లు రెచ్చిపోయారు.  మేయర్ కు వ్యతిరేకంగా వారు సభలో పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో అరుపులు…కేకలతో సభ అట్టుడుకుంది.ఈ గందరగోళం మధ్యే జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్‌‌ను ఆమోదిస్తున్నట్లు మేయర్ విజయలక్ష్మి ప్రకటించారు.
బడ్జెట్ ఆమోదం తర్వాత మేయర్ ప్రశ్నోత్తరాలకు సమయం ఇచ్చారు. ప్రశ్నోత్తరాల్లోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది. మేయర్ పొడియం దగ్గరకెళ్లి బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. దీంతో ఆగ్రహానికి లోనైన మేయర్ జీహెచ్ఎంసీ సెక్షన్ 89/1 ప్రకారం బీఆర్‌ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు. మేయర్ బీఆర్ఎస్ సభ్యులను సభ నుంచి బయటకు పంపడంతో జీహెచ్‌ఎంసీ ఆఫీస్ ముందు బీఆర్‌ఎస్ ధర్నాకు దిగింది.  అనంతరం బీఆర్ఎస్ కార్పొరేటర్లు మాట్లాడుతూ, ప్రజల పక్షాన మాట్లాడితే సభ నుంచి బయటకు పంపుతారా..? ఇది ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు. రాష్ట్రంలో ఇష్టమొచ్చినట్లు పాలన చేస్తున్నారని వారు  మండిపడ్డారు.
ఎలాంటి చర్చ జరగకుండానే బడ్జెట్ ఆమోదించడం ప్రజాస్వామిక విధానం కాదని.. ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అన్నారు. మరోవైపు సభను అడ్డుకోవడాలనే లక్ష్యంతోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశానికి వచ్చారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపిస్తున్నారు. సభలో అలా వ్యవహరించడం సబబు కాదని కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు కావాలనే సభలో గందరగోళం సృష్టించారని ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. భిక్షాటన చేస్తూ పలువురు కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీ కార్యాలయంకు చేరుకున్నారు. జీహెచ్ఎంసీ పరిస్థితి ఘోరంగా ఉందని విమర్శించారు. తమ డివిజన్లకు నిధులు కేటాయించటం లేదని ఆరోపించారు. అలాగే గోషామహల్‌ స్టేడియాన్ని కూల్చొద్దని, అక్కడ ఉస్మానియా హాస్పిటల్ నిర్మించవద్దని బీజేపీ కార్యకర్తలు జీహెచ్‌ఎంసీ ఆఫీసు వద్ద నినాదాలు చేశారు. ఉస్మానియా హాస్పిటల్ వెనక ఉన్న ఏరియాలోనే కొత్త హాస్పిటల్ భవనం నిర్మించాలని  డిమాండ్ చేశాయి. 
అరెస్టును ఖండించిన కేటీఆర్
బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టున పార్టీ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ ఖండించారు. వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాలకమండలి సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్లను అరెస్టు చేయడం దుర్మార్గమని  వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకు గెంటేస్తారా? అని నిలదీశారు.
గత సంవత్సరం కేటాయించిన బడ్జెట్ నిధులను కనీసం ఖర్చు చేయకుండా, మరోసారి అవే కాగితాలపై అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు బీఆర్ఎస్  ప్రజాప్రతినిధుల గొంతు నొక్కుతారా? అంటూ మండిపడ్డారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజా సౌకర్యాలను కూడా సరిగ్గా నిర్వహించలేని జిహెచ్ఎంసి అసమర్థ తీరును ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందని ధ్వజమెత్తారు. నగర ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.అప్పటివరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రిని నిలదీస్తూనే ఉంటామని  గురువారం విడుదల చేసిన ఒక  పత్రికా ప్రకటనలో హెచ్చించారు.

Leave A Reply

Your email address will not be published.