- ప్రజల్ని మోసం చేసే ఉద్దేశ్యం కాంగ్రెస్ కు లేదు
- రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పథకాలు అమలు
- అధికారుల నిర్లక్ష్యమూ దీనికి కారణం
- రిజర్వేషన్లు పెంచాకే ‘స్ధానిక’ పోరు
- జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఫోకస్ చేశాం
- మేయర్ పీఠం కాంగ్రెస్ దే
- మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి
- టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికల ముందు తమ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు మరింత ఆలస్యం కావచ్చని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అనుమానం వ్యక్తం చేశారు. అంతే తప్ప ప్రజలను మోసం చేసే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి ఏ మాత్రం లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదన్న ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకొని పథకాల అమలు ఉంటుందని స్పష్టం చేశారు. గురువారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు.ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాల అమలు విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేసిన వ్యాఖ్యల వెనక ప్రభుత్వం వద్ద డబ్బులు లేవనే ఉద్దేశం ఒక్కటే కాదన్నారు. అయితే క్షేత్రస్ధాయిలో పలువురు అధికారుల నిర్లక్ష్యంతోనూ పథకాల అమలులో జాప్యం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో కుల సర్వే జరిగితే తమకు నష్టం జరుగుతుందనే భయంతో అది జరగకుండా బీఆర్ఎస్,బీజేపీలు కుట్రలు చేశాయన్నారు.అయినా కులగణన సంపూర్ణంగా పూర్తయిందన్నారు. కేంద్రం నుండి హైదరాబాద్‌కు నయా పైసా తీసుకురాని ఇద్దరు కేంద్రమంత్రులు మన రాష్ట్రంలో ఉన్నారని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయని ఆయా కేంద్రమంత్రులు వచ్చేవి కూడా రానివ్వడం లేదని మండిపడ్డారు. అయినా జీహెచ్ఎంసీ సమావేశం రోజున బీజేపీ కార్పొరేటర్లు, నేతలు బిక్షాటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన నివాసం లేదా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే సమీక్షలు నిర్వహిస్తున్నారన్న విమర్శలను మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. సమయాన్ని బట్టి సీఎం ఇంటి దగ్గర సమీక్ష చేస్తారు అందులో తప్పేముందని ప్రశ్నించారు. సచివాలయం కూల్చి మళ్లీ కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్నారు. జనాలు ఎవరు ఫాం హౌజ్ పాలన కోరుకోవడం లేదని పార్టీ చీఫ్ తెలిపారు.
సర్వేలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కల్పితాలన్నారు. వచ్చే నెల రెండో వారంలో సూర్యాపేట జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. అందుకు రాహుల్ గాంధీ హాజరువుతారని వెల్లడించారు. పటాన్ చెరు కాంగ్రెస్ వివాదంపై కమిటీ నివేదిక ఇంకా రాలేదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కమిటీ ముందుకు రావాల్సి ఉందన్నారు. సమస్య సామరస్య పూర్వకంగా పరిష్కారం అవుతుందని చెప్పారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ జాతీయ నాయకులు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టుకుంటే బాగుటుందన్నారు. యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని ఓ ఉద్యమకారుడిగా గౌరవిస్తారు..అభిమానిస్తారని చెప్పారు. వైఎస్ఆర్ కు కూడా రాష్ట్రంలో లక్షలాది మంది అభిమానులు ఉన్నారన్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునిచ్చారు. నక్సలిజం ఇప్పుడు శాంతిభద్రతల సమస్యగా మారిందని చెప్పారు. అందుకే వారిని జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.
వచ్చే నెల 5న కులగణనపై మంత్రిఉపసంఘం భేటీ
కులగణన నివేదికపై ఫిబ్రవరి 5న కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఉంటుందని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఈ భేటీలో కుల గణన సర్వే రిపోర్టుపై చర్చిస్తామన్నారు. తర్వాత అదే నెల 7న ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి కులగణన నివేదికపై సభలో చర్చించి ఆమోద ముద్ర వేస్తామన్నారు. అయితే రిజర్వేషన్ల పెంపు తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొలిక్కి వచ్చిందన్నారు.
జీహెచ్ఎంసీ మేయర్ పీఠం కాంగ్రెస్ దే..!
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈసారి కాంగ్రెస్ సత్తా అంటే ఏంటో చూపిస్తామని టీపీసీసీ చీఫ్ చెప్పారు. త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నిక ల్లో నగరంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. మేయర్ పీఠం గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. 14 నెలల కాంగ్రెస్ పాలనలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. నగరంలో ముఖ్యంగా మెట్రో విస్తరణ పనులు,ఫోర్త్ సిటీ,హైడ్రా,మూసీ ప్రక్షాళనతో రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టబడులు వచ్చాయని తెలిపారు. కొంతమంది కావాలనే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రియల్ ఎస్టేట్ ఏ మాత్రం పడిపోలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని వర్గాల నుంచి వస్తోన్న ఆదరణ చూసి కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ..ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఎమ్మెల్యేల అభిప్రాయ ప్రకారం ఉంటుందన్నారు. ఇప్పటికే దీనిపై కసరత్తు పూర్తయిందన్నారు. అభ్యర్థుల షార్ట్ లిస్ట్ ఏఐసీసీకి పంపించామన్న పార్టీ చీఫ్..అభ్యర్ధి ఎంపిక విషయంలో అధిష్టానానిదే తుది నిర్ణయం అన్నారు. అభ్యర్థుల ఎంపికపై వచ్చే నెల 3న సమావేశం నిర్వహిస్తామన్నారు.