- సముద్రంలో కలిసే నీళ్లనే వాడుకుంటాం.
- గొడవలు పెట్టుకుంటే ఎవరికి లాభం.
- గోదావరిపై అనుమతి ఉన్న ప్రాజెక్టు కేవలం పోలవరం మాత్రమే.
- కాళేశ్వరం సహా దేనికి అనుమతి లేదు.
- బనకచర్లతో ఎవరికీ నష్టం లేదు.
- ఈ ప్రాజెక్టును నిర్మించి తీరుతాం.
- ఏపీ సీఎం చంద్రబాబు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : సముద్రంలో కలిసే నీటి వాడకంపై సమస్య సృష్టించడం ఎంత వరకు సమంజసమని ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నీటి ప్రాజెక్టులపై మాట్లాడారు. గోదావరిలో నీళ్లను ఇరు రాష్ట్రాలు వాడుకుంటున్నాయని, పోలవరం తప్ప మిగతావన్నీ అనుమతి రాని ప్రాజెక్టులేనని చెప్పారు.మనం మనం కొట్లాడుకుంటే ఎవరికి లాభం? తెలంగాణపై ఎప్పుడైనా గొడవ పడ్డానా? అని అడిగారు. కృష్ణాలో తక్కువ నీటిపై గొడవ పడితే లాభం లేదని, కొత్త ట్రైబ్యునల్ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్లాలని తెలిపారు. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, గోదావరి నీళ్లను రెండు రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయని, నీళ్లు ఉన్నాయి కాబట్టి వాళ్లు తీసుకోవచ్చని, తామూ తీసుకోవచ్చనని అన్నారు. కృష్ణా నదిలో మాత్రమే నీళ్లు తక్కువ ఉన్నాయని, కొత్త అథారిటీ ఎలా కేటాయిస్తే అలా తీసుకుందామని ప్రశ్నించారు. తెలిపారు. దేవాదుల, కల్వకుర్తి తాను ప్రారంభించిన ప్రాజెక్టేలేనని, కాళేశ్వరం ప్రాజెక్టును తాను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ నిర్మించుకోమ్మని చెప్తున్నానని, వాళ్లు ప్రాజెక్టులు నిర్మించుకుంటే నేనేమీ అడ్డుచెప్పనని స్పష్టం చేశారు.
- గోదావరి–-బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం ఉండదు.
గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, ఏపీ, తెలంగాణ రెండూ వాడుకోవచ్చని, కృష్ణా నదిలో మాత్రమే నీళ్లు తక్కువ ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. గోదావరిలో ఎవరి శక్తి మేరకు వాళ్లు ప్రాజెక్టులు నిర్మించుకుందామని వెల్లడించారు. రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉందామని అన్నారు. ఎవరూ ఎవరిపైనా పోరాడాల్సిన అవసరం లేదని, కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని, కేటాయింపుల చట్టబద్ధత కోసం కేంద్రం వద్ద కూర్చుని మాట్లాడుకుందామని కోరారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం ఉండదని, తెలంగాణ కూడా ప్రాజెక్టులు కట్టుకుని బాగుపడాలని కోరుకుంటానని తెలిపారు. గొడవలు చేసి ప్రజలను మభ్యపెట్టొద్దని కోరారు. ఏపీ, తెలంగాణ.. రెండు రాష్ట్రాలు అభివృద్ధి కావాలని అన్నారు. తాను అభివృద్ధి చేసిన హైదరాబాద్ వల్ల తెలంగాణకు ఇప్పుడు 70 శాతం వస్తోందని, జీఎస్‌డీపీలో ఇప్పుడు తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందని అన్నారు. నేను చేసిన పని వల్ల ఇప్పుడు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారని, నాకూ సంతోషమేనని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధి చెందుతుందని ముందే చెప్పానని, సొంత ఓటు బ్యాంకుకు కొంత ఫేవర్ చేయాలని ఎవరైనా భావిస్తారని, తెలంగాణలో మంచి ఎకో సిస్టమ్ ఉన్న రాష్ట్రమని పేర్కొన్నారు. తెలంగాణ వంటి పరిస్థితులు ఏపీలో రావాలంటే సమయం పడుతుందని, ప్రజాహితం కోసమే నా పోరాటాలు ఉంటాయని, తెలంగాణ, ఆంధ్ర రెండూ అభివృద్ధి చెందాలని తెలిపారు. నల్గొండ జిల్లాలో విపరీతమైన ఫ్లోరైడ్ సమస్య ఉండేదని, ఆ జిల్లా కోసం ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టును నేనే చేపట్టానని తెలిపారు. ఏఎంఆర్ విజయవంతం కాగానే దేవాదుల చేపట్టానని అన్నారు. కొత్త ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్లు ఎలా కేటాయిస్తే అలా అని.. వారి నిర్ణయం మేరకు నడుచుకుందామని చెప్పారు. తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును తాను వ్యతిరేకించలేదన్నారు. సముద్రంలో కలిసే నీటిని వాడుకోవడంపై అభ్యంతరాలు ఎందుకు అని ప్రశ్నించారు. తెలంగాణపై భాగంలో ఉంది.. కింద ఉన్న ఆంధ్రప్రదేశ్ నీళ్లు వాడుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు. సముద్రంలో కలిసే నీళ్లు వాడుకుంటామంటే రాద్ధాంతాలు, అభ్యంతరాలు ఎందుకు అన్నారు.