కృష్ణా మిల్క్ యూనియన్ (విజయా డెయిరీ) పాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం ఏడు రకాల పాలపై లీటరుకు రూ.2 చొప్పున ధరలు పెరిగాయి.
అదే విధంగా పెరుగు బకెట్ల ధరలపై కూడా పెరుగుదల చోటుచేసుకుంది. పెరుగు బకెట్లపై రూ.10 నుంచి రూ.30 వరకు ధరలు పెంచగా, 10 కేజీల స్టాండర్డ్ మిల్క్ పెరుగు బకెట్‌పై రూ.40 వరకు పెంపు చేసినట్లు యూనియన్ ప్రకటించింది.
ఈ కొత్త ధరలు ఈ నెల 4వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. నెలవారీ కార్డులు కొనుగోలు చేసిన వినియోగదారులకు మాత్రం ఏప్రిల్ 9వ తేదీ వరకు పాత ధరలే వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు.
నిర్వహణ వ్యయం పెరగడం, బటర్ మరియు పౌడర్ ధరలు పెరగడం, అలాగే రైతులకు చెల్లించే పాల కొనుగోలు ధరలు పెంచాల్సి రావడం వంటి కారణాల వల్లే ఈ ధరల సవరణ చేయాల్సి వచ్చిందని యూనియన్ పేర్కొంది. వినియోగదారులు ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని సహకరించాలని చైర్మన్ చలసాని ఆంజనేయులు కోరారు.