- క్యాబినెట్ లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మిస్తామా?
- ఏ నిర్ణయమైనా క్యాబినెట్‌లో పెట్టాలని కేసీఆర్ చెప్పారు.
- బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం కమిషన్ విచారణ వెంటనే పూర్తి చేయాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. క్యాబినెట్ ఆమెదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. కాళేశ్వరం వంటి పెద్ద ప్రాజెక్టును మంత్రివర్గం ఆమోదం లేకుండా నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. మాజీ సీఎం కేసీఆర్ క్యాబినెట్‌లో చర్చించకుండా ఏ నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ నిర్ణయం తీసుకున్నా క్యాబినెట్ ఆమెదం తీసుకుంటారని, తాను బీజేపీ ఎంపీగా కాకుండా నాటి మంత్రిగా చెబుతున్నారనని ఎంపీ ఈటల స్పష్టం చేశారు. కీలకమైన అంశాలపై క్యాబినెట్ ఆమోదం లేకుండా కేసీఆర్ ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోలేదన్నారు. ఆనాడు ఉన్న ముగ్గురు మంత్రులు ఇప్పుటి సీఎం రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నారని, అవసరమైతే వారిని అడిగితే స్పష్టంగా చెప్తారని ఈటల అన్నారు.