Take a fresh look at your lifestyle.

విద్యార్థులను అభినందించిన డిఇఓ రమేష్ కుమార్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థులు ఇ-అభ్యాస్ ఐఐటీ ఫౌండేషన్ స్టాండర్డ్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో విద్యార్థులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

జర్నలిస్ట్ సయ్యద్ రబ్బాని కుమార్తె రిదా కరీమా మొదటి ర్యాంకు సాధించగా, అదే పాఠశాలకు చెందిన మహమ్మద్ పైజాన్ (3వ తరగతి) రెండవ ర్యాంకు, మేఘన (6వ తరగతి) మూడవ ర్యాంకు సాధించారు. హైదరాబాద్‌లోని భారతీయ విద్యా భవన్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఇ-అభ్యాస్ ఫౌండేషన్ ప్రతినిధులు వీరికి సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రతిభ కనబరిచిన లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులు ఐఐటీ స్టాండర్డ్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం గర్వకారణమని తెలిపారు.

విద్యార్థులను ఐఐటీ స్థాయిలో తీర్చిదిద్దే విధంగా నాణ్యమైన విద్య అందించిన పాఠశాల యాజమాన్యం, అధ్యాపక బృందాన్ని ఆయన అభినందించారు. జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి కొనసాగుతుందని, తల్లిదండ్రులు మరియు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల అధ్యాపకులు కలిసి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ (ఎగ్జామినేషన్) రాజశేఖర్ రావు, పాఠశాల ప్రిన్సిపాల్ సింగిరెడ్డి ఫాతిమా రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ వీరప్ప, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను జిల్లా విద్యాభిమానులు, పాఠశాల అధ్యాపక బృందం అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.