Take a fresh look at your lifestyle.

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి … జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి

ముద్ర ప్రతినిధి, వనపర్తి : ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, సహా ప్రజలందరూ రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతీయ రోడ్డు భద్రత మసొత్సవాల సందర్భంగా అధికారుల చేత రోడ్డు భద్రత ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రవాణా శాఖ అధికారి మానస ఆధ్వర్యంలో అధికారులందరి చేత రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. అందరూ రోడ్డు భద్రత నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి నెలను జాతీయ రోడ్డు భద్రత మాసం గా ప్రకటించిన నేపథ్యంలో, ప్రతిరోజు రోడ్డు భద్రతపై విభిన్న అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించడమే కాకుండా ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని చెప్పారు. మనిషి జీవితం అనేది చాలా విలువైనదని హెల్మెట్ ధరించడం ద్వారా జీవితాన్ని కాపాడుకోవచ్చని చెప్పారు.

జనవరి 8వ తేదీన బైక్ ర్యాలీ

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా అందరికీ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు జనవరి 8వ తేదీన ఐ డి ఓ సి నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ర్యాలీలో, అధికారులు, యువత, ప్రజలు హెల్మెట్ ధరించి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిజ్ఞ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.