Take a fresh look at your lifestyle.

పదేండ్ల విధ్వంసాన్ని అధిగమిస్తున్నాం!

  • ఇదే మా పాలసీ.
  • ప్రపంచంతో పోటీ పడే విధంగా రైజింగ్​ పాలసీ.
  • వ్యవస్థలన్నీ గాడిన పెడుతున్నాం.
  • పేదలకు సన్న బియ్యం పంపిణీ.
  • తద్వారా సన్నాల సాగు పెరిగింది.
  • మహిళలకు క్యూఆర్​ కోడ్​తో కార్డులు.
  • వారందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు.
  • తెలంగాణ పోలీసులు నెంబర్​ వన్.
  • డ్రగ్స్​, నేరాల నియంత్రణలో టాప్.
  • రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్​ రెడ్డి.
  • 9 మంది ఉద్యమకారులకు రూ. కొటి చొప్పున ఆర్థిక సాయం.

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్​ 2047 పాలసీ డాక్యుమెంట్​ రూపొందించామని, 2047 నాటికి తెలంగాణను గొప్ప అభివృద్ధి పథంలో నడిపించాల్సి ఉందని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకే ప్రత్యేకమైన ఉత్పత్తులను ప్రపంచానికి చూపించామని, పెట్టుబడులు, పర్యాటకానికి తెలంగాణలో ఉన్న అనుకూలతలను ప్రపంచానికి చూపించామని వివరించారు. సికింద్రాబాద్​ పరేడ్​గ్రౌండ్​లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్​ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ గెలుపొందాక బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే మా అజెండా అనీ, పదేళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను చక్కదిద్దుతున్నామని తెలిపారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలు మహిళలు అని పేర్కొన్నారు.మహిళా సంఘాల బస్సులను ఆర్టీసీకి అద్దెకు తీసుకుని వాళ్లకు ఆదాయం కల్పిస్తున్నామని వివరించారు.

  • సన్నాల సాగు పెరిగింది.

మహిళా సంఘాలకు క్యూఆర్​ కోడ్​తో కూడిన కార్డులు ఇవ్వాలని భావిస్తున్నట్లు సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. క్యూఆర్​ కోడ్​ కార్డు ఉన్న మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించే పథకాన్ని తీసుకువస్తామని స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టిందని, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రైతులకు రూ.2 లక్షలలోపు రుణాలు మాఫీ చేశామని వెల్లడించారు. రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో రూ.26 వేల కోట్లు వేశామని, సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాల్​కు రూ.500 బోనస్​ ఇస్తున్నామని, బోనస్​ పంపిణీ వల్ల రాష్ట్రంలో సన్నవడ్ల సాగు గణనీయంగా పెరిగిందని, రాష్ట్రంలో 2.75 లక్షల టన్నుల సన్నధాన్యం వస్తోందని సీఎం రేవంత్ సంతోషం వ్యక్తం చేశారు.

  • అందుకే భూ భారతి.

రాష్ట్రంలో గత ప్రభుత్వం ధరణి పోర్టల్​ను తెచ్చి రైతుల భూములను ఆగం చేశారని, కానీ, తమ ప్రభుత్వం రైతులకు వివాదాలు లేని భూములు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుని,భూమి వివాదాలు లేకుండా చేసేందుకే భూభారతి తీసుకువచ్చామని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో ఒక స్పష్టమైన ప్రణాళిక ప్రకారం వ్యవస్థలను గాడిన పెడుతున్నామని,ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు.నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుస్తూ వారి విశ్వాసాన్ని పొందాం.సివిల్స్‌కు ఎంపికైన వారికి లక్ష రూపాయల ప్రోత్సాహం ఇస్తున్నామని, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, గురుకుల విద్యార్థులంతా ఒకే ప్రాంగణంలో ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు.దీనికోసం ప్రతి నియోజకవర్గంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ నిర్మిస్తున్నామని, రూ.200 కోట్లతో నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ భవనాలు నిర్మిస్తున్నామని సీఎం రేవంత్​ రెడ్డి వివరించారు.తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య, వైద్య రంగాన్ని ప్రక్షాళన చేపట్టామని, ప్రభుత్వ వసతిగృహం విద్యార్థులకు డైట్‌, కాస్మోటిక్‌ ఛార్జీలను పెంచామన్నారు.ఉస్మానియా ఆస్పత్రికి పూర్వ వైభవం తీసుకువస్తామని, పేదల ఆరోగ్యం కాపాడటమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని సీఎం రేవంత్​రెడ్డి వెల్లడించారు.

  • దానికి మనమే కారణం.

ఇక, దేశంలో దాదాపు వందేళ్ల క్రితం కులగణన జరిగిందని, వందేళ్లలో జరగని కులగణనను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక చర్యతో కేంద్రంలో కూడా కదలిక వచ్చిందని, వచ్చే జనగణనలో కులగణన కూడా చేర్చుతామని ఇటీవల కేంద్రం ప్రకటించిందని, కేంద్రం తీసుకున్న కులగణన నిర్ణయానికి తెలంగాణ కులసర్వేనే కారణమని రేవంత్​ రెడ్డి చెప్పారు.56 శాతంగా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.

  • తెలంగాణ పోలీసులు నంబర్​ వన్.

శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే ముందున్నారని సీఎం రేవంత్​ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో అవార్డులు కూడా అందుకున్నారని, డ్రగ్స్​, నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు ముందున్నారని, సైబర్ నేరాల నివారణ, సొమ్ము రికవరీలో తెలంగాణ పోలీసుల పనితీరు నంబర్​వన్​ అని సీఎం ప్రశంసించారు.యువతను కుంగదీస్తున్న డ్రగ్స్‌ను నియంత్రించడంలో తెలంగాణ పోలీసులకు అవార్డు వచ్చిందని గుర్తు చేశారు. గంజాయి మాఫియా రాష్ట్రంలో అడుగు పెట్టాలంటేనే వారిలో వెన్నులో వణుకు పుడుతోందని అన్నారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన భారత్​ సమ్మిట్​లో 100 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. మిస్​ వరల్డ్​ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందన్నారు.ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలు, గొప్ప కట్టడాలను ప్రపంచానికి చూపించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.

  • ప్రపంచ పటంలో తెలంగాణ.

రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ ప్రభుత్వం సుదీర్ఘ ప్రణాళికలు వేసిందని, విద్యారంగంలో పెట్టుబడిని భవిష్యత్తుకు పునాదిగా సీఎం అభివర్ణించారు. తెలంగాణను ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యమని స్పష్టం చేశారు.ముఖ్యంగా, న్యూయార్క్, టోక్యో వంటి ప్రపంచ మహానగరాలకు దీటుగా ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని ప్రకటించారు. తెలంగాణను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు..అన్ని రంగాల్లో పోటీపడేలా పక్కాగా పాలసీ డాక్యుమెంట్‌ను తీసుకొస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగర ముఖ చిత్రాన్ని మార్చే ప్రణాళికల్లో భాగంగా మూసీ నదికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టబోతున్నామని పేర్కొన్నారు.కాగా, న్యూయార్క్, టోక్యో వంటి అంతర్జాతీయ నగరాలకు దీటుగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని సీఎం ప్రకటించారు. ఇది ప్రపంచ స్థాయి పెట్టుబడులకు కేంద్ర బిందువుగా మారబోతుందని, దేశ, విదేశాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని, హైదరాబాద్‌ను మరింత తీర్చిదిద్దేందుకు జపాన్ సహకరిస్తుందని సీఎం వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ మహానగరంగా ఆవిర్భవించినట్లు, రీజినల్ రింగ్ రోడ్డుతో రాష్ట్ర రూపురేఖలే మారబోతున్నాయని జోస్యం చెప్పారు.మెట్రో విస్తరణలో జాప్యం వల్ల హైదరాబాద్ టాప్ సిటీల్లో 9వ స్థానానికి పడిపోయిందని గుర్తు చేస్తూ త్వరలోనే మెట్రోను విస్తరించి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామన సీఎం.

  • 9 మంది ఉద్యమకారులకు కోటి చొప్పున సాయం.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మందికి కోటి రూపాయల నగదు పురస్కరాన్ని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అందించారు.తెలంగాణ ఉద్యమంలో ప్రజల గుండెల్లో నిలిచిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలు ఇలా 9 మందికి రూ.కోటి నగదు పురస్కారాన్ని అందిస్తామని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజున ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పరేడ్​ గ్రౌండ్స్​లో సీఎం రేవంత్​ రెడ్డి వారికి నగదు పురస్కారాన్ని అందించారు.తెలంగాణ ఉద్యమకారులు ఎక్కా యాదగిరి రావు, అందెశ్రీ, సుద్దాల అశోక్​ తేజ, జయరాజు, పాశం యాదగిరి, దివంగత గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి, గోరటి వెంకన్న ఈ కోటి పురస్కారాలు ఇచ్చారు. ఇక, బహు భాషా సాహితీ వేత్త నలిమెల భాస్కర్​కు కాళోజీ పురస్కారాన్ని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అందించారు. అలాగే 19 మంది పోలీసు అధికారులకు మెడల్​ ఫర్​ గ్యాలంట్రీ, 11 మందికి మెడల్​ ఫర్​ మెరిటోరియస్​ సర్వీస్​ అవార్డులు ప్రదానం చేశారు.

Leave A Reply

Your email address will not be published.