- తెలంగాణ రూ. 10 లక్షల కోట్ల అప్పులుపాలు.
- అదంతా బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన వైఫల్యమే.
- తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చేది బీజేపీయే.
- ఒట్టేసి చెబుతున్నా.. తెలంగాణను అభివృద్ధి చేసే బాధ్యత బీజేపీది.
- మోదీ నేతృత్వంలోని నీతి, నిజాయితీతో పాలన అందిస్తాం.
- బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు.
- జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దోపిడీ అవినీతి పార్టీలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.ఈ రెండు పార్టీలకు తెర దించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి వైపు పునఃనిర్మించాలంటే బీజేపీ పార్టీయే ప్రత్యామ్నాయమని చెప్పారు.తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని ఒట్టేసి చెబుతున్నాని అన్నారు.ప్రధాని మోడీ నేతృత్వంలో నీతి, నిజాయితీతో పాలన అందిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేర్చేది బీజేపీ మాత్రమేనని అన్నారు.ఈ మేరకు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని కిషన్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమం ప్రపంచ చరిత్రలో అహింసాయుతంగా సాగిన ప్రబలమైన పోరాటంగా గుర్తించదగ్గదని చెప్పారు.తెలంగాణ కోసం 1200 మందికిపైగా యువతులు, విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారని, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఢిల్లీ పార్లమెంట్ వరకు ఆందోళనలు కొనసాగినట్లు గుర్తు చేశారు. అన్ని పార్టీలకన్నా ముందుగా బీజేపీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నదని, జేఏసీలో చేరిన ఏకైక జాతీయ పార్టీ బీజేపీనేనని పేర్కొన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీజేపీ పోరాడిందని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం పార్లమెంట్‌లో గళమెత్తిందని తెలిపారు.కానీ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందని, ప్రజలకు మాత్రం ఆశించిన ఫలితాలు లభించలేదన్నారు. వేల కోట్ల రూపాయలు నీటి ప్రాజెక్టుల పేరిట దుర్వినియోగం అయ్యాయని మండిపడ్డారు.ఉద్యమ కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసులు రబ్బరు బుల్లెట్లు, లాఠీలతో విరుచుకుపడినప్పుడు, దేశ వ్యాప్తంగా బీజేపీ ఎంపీలు తెలంగాణ యువతకు అండగా నిలిచారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 ఏళ్ల తర్వాత ప్రజలు, మేధావులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ హామీ ఇచ్చిన బంగారు తెలంగాణ సాధించలేదని, ఆయన కుటుంబం మాత్రం బంగారమైందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా నడిపారని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. గతంలో సోనియాగాంధీని “తెలంగాణ పాలిట దెయ్యం” అన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి రాగానే ఆమెను దేవతగా పొగడటం ద్వంద్వ వైఖరిని చూపిస్తోందన్నారు.మిగులు బడ్జెట్‌తో ప్రారంభమైన తెలంగాణ ఈ రోజు రూ. 10 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, ఇది టీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనల వల్లే అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రెండూ అవినీతి, కుటుంబ పార్టీలు, ప్రజలను మోసం చేసినవే అని విమర్శించారు.