జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం తొలి విడతలో 146 అక్రిడేషన్ కార్డులకు ఆమోదం జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్
ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
నాగర్‌కర్నూల్ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ (DMAC) తొలి సమావేశం మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, కమిటీ చైర్మన్ హేమంత్ కేశవ్ పాటీల్ అధ్యక్షతన నిర్వహించారు.
సమావేశం ప్రారంభంలో కమిటీ సభ్యులను జిల్లా కలెక్టర్ పరిచయం చేసుకున్నారు. 2026–2028 కాలానికి సంబంధించిన మీడియా అక్రిడిటేషన్ కార్డుల కోసం ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను సమావేశంలో పరిశీలించారు. ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. 252 నిబంధనల మేరకు అర్హత సాధించిన జిల్లాస్థాయి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన 146 దరఖాస్తులకు కమిటీ సభ్యులు ఆమోదం తెలపగా, కమిటీ చైర్‌పర్సన్‌గా కలెక్టర్ వాటిని మంజూరు చేశారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన జర్నలిస్టులకు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ద్వారా పూర్తి పారదర్శకంగా అక్రిడిటేషన్ కార్డులు జారీ కావాలని కలెక్టర్ సూచించారు. భవిష్యత్తులో వచ్చే దరఖాస్తులను కూడా ఇదే విధంగా క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
హోల్డ్‌లో ఉంచిన, తిరస్కరించిన దరఖాస్తులపై కూడా కలెక్టర్ సమీక్ష నిర్వహించి, అందుకు గల కారణాలను జిల్లా పౌర సంబంధాల అధికారి (DPRO)ను అడిగి తెలుసుకున్నారు.
తొలి విడతలో మంజూరు చేసిన అక్రిడేషన్ కార్డులపై ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా అని కమిటీ సభ్యులను కలెక్టర్ ప్రశ్నించగా, అర్హులైన వారికే కార్డులు మంజూరు చేశామని, ఎలాంటి అభ్యంతరాలు లేవని సభ్యులు తెలిపారు.
అనంతరం కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్‌ను శాలువాతో సత్కరించారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సంబంధాల అధికారి కిరణ్ కుమార్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు పి. విజయ్ కుమార్, చంద్రశేఖర రావు, సురేష్ కుమార్, దస్తగిరి, ప్రదీప్ కుమార్, ముబీన్ అహ్మద్ ఖాన్, వెంకటస్వామి, శ్రీనివాసులు, నేతాజీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.