భక్తిశ్రద్ధలతో పోటెత్తిన భక్తులు.. ‘జై శ్రీరామ్’ నినాదాలతో మార్మోగిన పురవీధులు
ముద్ర కూకట్‌పల్లి :
హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్‌పల్లి నియోజకవర్గవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నియోజకవర్గంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆంజనేయ స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్‌లో హనుమాన్ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం, భారీ హనుమాన్ శోభాయాత్రను ఏర్పాటు చేశారు. ఈ యాత్రకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ మరియు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన శోభాయాత్ర కనుల పండువగా సాగింది.జై శ్రీరామ్’, ‘జై హనుమాన్’ అంటూ భక్తులు చేసిన నినాదాలతో రాజీవ్ గాంధీ నగర్ పురవీధులన్నీ మార్మోగాయి.హిందూ యువకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కేరింతలు కొడుతూ, భక్తిపాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ అలరించారు.
వీధులన్నీ కాషాయ జెండాలతో, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక భక్తులు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను దిగ్విజయం చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.