– రూ. 4 కోట్ల అక్రమాస్థుల గుర్తింపు
– అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ రిమాండ్ కి తరలింపు
సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :
సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కాటన్ శ్రవణ్ కుమార్ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు చిక్కారు. విధుల్లో ఉన్న సమయంలో అక్రమ మార్గాల్లో ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల విషయంలో నమోదైన కేసులో భాగంగా శనివారం కరీంనగర్ లోని ఆయన నివాసంతో పాటు తన సోదరి ఇంటిలో ఏక కాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో దాదాపు రూ.4 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను ఏసీబీ గుర్తించింది. అంతే కాకుండా వారి ఆస్తులు మార్కెట్ విలువ కంటే ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ సోదాలలో రూ.11.90 లక్షల నగదు, రూ.4.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.15.66 లక్షల విలువైన గృహోపకరణాలు, రూ. 30 లక్షలు విలువ చేసే లగ్జరీ వాహనాలు, రెండు రూ.1.6 లక్షలు విలువ చేసే ద్విచక్ర వాహనాలు, కరీంనగర్ లో 2 ఇళ్ళు, ఒక అపార్ట్మెంట్ లో 6 ప్లాట్లు, 4 ఖాళీ ప్లాట్ల పత్రాలను సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటి విలువ రూ. 2.47 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి తహసీల్దార్ ను అదుపులోకి తీసుకుని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. తహసీల్దార్ తన అధికారిక హోదాను దుర్వినియోగం చేసి ఈ ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది.