నేటి నుంచి ఈనెల 30 వరకు (సాయంత్రం 5:00 గంటల వరకు)
నామినేషన్ల పరిశీలన : జనవరి 31
నామినేషన్ల ఉపసంహరణ గడువు: ఫిబ్రవరి 3 మధ్యాహ్నం 3:00 గంటల వరకు.
పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 11, 2026 (ఉదయం 7:00 నుండి సాయంత్రం 5:00 వరకు).
రీ-పోలింగ్ (అవసరమైతే): ఫిబ్రవరి 12, 2026.
ఓట్ల లెక్కింపు , ఫలితాలు: ఫిబ్రవరి 13, 2026.
ఎన్నికల వివరాలు
ఎన్నికలు జరగనున్న కార్పొరేషన్లు : 07 (కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ)
కార్పొరేషన్ల పరిధిలో డివిజన్ల సంఖ్య : 414
మున్సిపాలిటీలు : 116
మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య : 2,582
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య : 52.43లక్షలు
పురుష ఓటర్లు : 25.62 లక్షలు
మహిళా ఓటర్లు : 26.80 లక్షలు
ఇతర ఓటర్ల సంఖ్య : 640
మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపిక : 14.02.2026లోపు
మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ ఛైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం : 16.02.2026
‘పుర’భేరీ
మోగిన మున్సిపల్ నగారా
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
నేటి నుంచి నుంచి ఈనెల 30 వరకు నామినేషన్లు
ఓటు హక్కు వినియోగించుకోనున్న 52.43లక్షల మంది
అందరూ ఓటు హక్కును వినియోగించుకోండి :రాణి కుముదిని
అమల్లోకి ఎన్నికల కోడ్
నగదు రవాణాపై కఠిన నియమాలు , పోలీసులు నిఘా
పోలింగ్ , లెక్కింపు , భద్రతా ఏర్పాట్ల పూర్తి షెడ్యూల్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మంగళవారం మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే దఫాలో ఒకే రోజున ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నామని చెప్పారు. ఫిబ్రవరి 11న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించి, 13వ తేదీన ఫలితాలు వెలువడుతాయని ఆమె పేర్కొన్నారు. నేటి నుంచి ఈ నెల 28 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఫిబ్రవరి 3వ తేదీన గడువు ముగుస్తుందని తెలిపారు. ఫిబ్రవరి 15వ తేదీ కల్లా మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు తెలిపారు,. ఈ ఎన్నికలో మొత్తం 52.43లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారని చెప్పారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు. రీ పోలింగ్ ఎక్కడైనా అవసరం ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహించి మిగతా అన్ని స్థానాలతోపాటే ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపధ్యంలో తక్షణమే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 16న మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్ పర్సన్ల ఎన్నిక ఉంటుందని తెలిపారు. కాగా నోటిఫికేషన్ విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) తక్షణం అమల్లోకి వచ్చింది. రంజాన్, శివరాత్రి పండుగలను దృష్టిలో ఉంచుకుని ఈలోపే ఎన్నికలు ముగించాలని ప్రభుత్వం భావించింది. జీహెచ్‌ఎంసీ మినహా మిగిలిన చోట్ల ఈ ఎన్నికలు జరుగుతాయి. నామినేషన్ వేయనున్న అభ్యర్థులు నామినేషన్ వేసే లోపు ఆస్తి పన్ను, నల్లా బిల్లు బకాయిలు లేకుండా చూసుకోవాలి. ఫిబ్రవరి 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఇచ్చారు. నామినేషన్ల ప్రారంభం నుంచే అభ్యర్థులు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు. పోలింగ్ జరిగిన తర్వాత ఎక్కడైనా హింసాత్మకం, అనుకోని సంఘటనలు జరిగితే రీపోలింగ్ చేసేందుకు ఫిబ్రవరి 12న రీపోలింగ్ కు అవకాశం ఇచ్చారు. పోలింగ్ అనంతరం ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 16వ తేదీన మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చేయనున్నారు. మున్సిపల్ కార్పొరేషన్‌లలో ఫిబ్రవరి 16వ తేదీన కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది.ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని రాజకీయ పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులొడ్డుతున్నాయి.
అమల్లోకి ఎన్నికల కోడ్
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తక్షణమే రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. అక్రమాలను అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లు రంగంలోకి దిగాయని ఏడీజీ మహేష్ భగవత్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నగదు రవాణాపై పోలీసులు కఠిన నిబంధనలు విధించారు.. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వ్యక్తులు గరిష్టంగా రూ. 50వేల వరకు మాత్రమే నగదును వెంట తీసుకెళ్లాలి. అంతకంటే ఎక్కువ నగదు ఉంటే తప్పనిసరిగా సరైన ఆధారాలు చూపించాలి, లేని పక్షంలో ఆ నగదును సీజ్ చేస్తారు. పోలీసులు నగదు లేదా ఇతర వస్తువులను సీజ్ చేసినప్పుడు తప్పనిసరిగా రిసీట్ ఇస్తారు. దానిపైనే అప్పీల్ చేసుకునే వివరాలు కూడా ఉంటాయి.
భద్రతా ఏర్పాట్లు , నిఘా
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ పోలీసులతో పాటు ఫారెస్ట్ , ఎక్సైజ్ శాఖల నుంచి సుమారు 2,000 మంది అదనపు సిబ్బందిని వినియోగిస్తున్నారు. పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. హైపర్ సెన్సిటివ్ , క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలతో నిఘా ఉంచుతారు. రౌడీ షీటర్లను బైండోవర్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఓటర్లందరూ ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ , పోలీస్ శాఖ విజ్ఞప్తి చేశాయి.