బొగ్గు స్కాంపై సమగ్ర విచారణకు ఆదేశించండి
సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయాలి
విచారణ బాధ్యత కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఇవ్వండి
గవర్నర్ కు బీఆర్ఎస్ నేతల వినతి
ఫుట్ బాల్ మ్యాచ్ కోసం రూ. 10 కోట్ల సింగరేణి నిధుల దుర్వినియోగం
కోల్ మాఫీయాకు నాయకుడిగా సీఎం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
కాంగ్రెస్ పాలనలో జరిగిన బొగ్గు కుంభకోణం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కోరారు. విచారణ బాధ్యత సీబీఐకి ఇస్తారా.? లేదా సిట్టింగ్ జడ్జికి ఇస్తారా..? మీరే నిర్ణయం తీసుకోవాలని కోరారు. సోలార్ పవర్‌లో కుంభకోణం, సింగరేణి ఓబి గనుల్లో కుంభకోణాలన్ను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి అయినా విచారణ ఆదేశాలు జారీ చేయాలన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం మంగళవారం లోక్ భవన్‍లో గవర్నర్‍ను కలిసింది. ఈ సందర్బంగా సింగరేణి టెండర్లలో బొగ్గు, డిజీల్ స్కామ్ జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ స్కామ్‍కు సంబంధించిన వివరాలను గవర్నర్‍కు అందజేశారు. అనంతరం లోక్ భవన్ బయట కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఫుట్ బాల్ మ్యాచ్ కోసం రూ. 10 కోట్ల సింగరేణి నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇప్పటికే ప్రజలతో ఆడుకుంటున్న సీఎం.. సింగరేణి సంస్థతో కూడా ఫుట్ బాల్ ఆడుతున్నారని ఆరోపించారు. సీఎం అంటే కోల్ మాఫీయాకు నాయకుడిగా భావించే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో సహా భయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్‍లో వణుకు మొదలైందని చెప్పారు. ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేశాక పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని విమర్శించారు. ఆధారాలతో కుంభకోణాలు బయటపెట్టినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. ఈ కుంభకోణంపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఒక్క సమాధానం రాలేదని మండిపడ్డారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచులు ఆడుతూ, విదేశాల్లో తిరుగుతూ పాఠాలు నేర్చుకుంటున్నా అని పోజులు కొడుతున్నాడని ఆరోపించారు. ఓబీ టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనతో పారదర్శకతకు పాతరేశారని, దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణి టెండర్లలో నిబంధనలు పెట్టారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా.? ఏ కోల్ గనిలో లేని, ఏ బొగ్గు గనిలో లేని నిబంధన తెలంగాణలోనే ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తే అధికార పార్టీ నేతలెవరూ ఇంతవరకు సమాధానం చెప్పలేదన్నారు. తమ పాలనలో బొగ్గు టెండర్లన్నీ పారదర్శకంగా నిర్వహించామన్నారు. నైనీలో కూడా గతంలో 2021లో, 2022లో రెండు సార్లు తమ ప్రభుత్వం ఉన్నప్పుడు టెండర్లు పిలిచామనీ కానీ ఆ రోజు ఈ ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ అనే నిబంధన లేదని గుర్తు చేశారు. నాడు తమ ప్రభుత్వంలో అవసరం లేని నిబంధన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు అవసరమైందని నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన సోలార్ పవర్ స్కామ్ గురించి కూడా ఇటీవల తాము బయట పెట్టామన్నారు. దేశంలో ఎక్కడైనా మెగావాట్‌కు రూ. రెండున్నర నుంచి రూ. 3 కోట్ల ఖర్చుతో సోలార్ నిర్మాణం జరుగుతుందన్నారు. కానీ తెలంగాణలో మాత్రం సింగరేణి పిలిచిన సోలార్ టెండర్లలో మాత్రం రూ. ఏడు కోట్లు అన్నారు. దేశం మొత్తంలో రూ. 3 కోట్లలోపు పని ఒక్క తెలంగాణలో మాత్రం రూ. 7 కోట్లు ఎందుకు అవుతున్నదని నిలదీశారు. టెండర్లలో లేని షరతు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ‘సైట్ విజిట్ సర్టిఫికేషన్’ అనే విధానం ఎందుకు పెట్టారు? ఎవరికి లాభం చేయడానికి పెట్టారో సమాధానం చెప్పాలన్నారు. నిబంధన అప్పటి నుంచి తొమ్మిది నెలల్లో ఎన్ని సంస్థలు ఇప్పటి వరకు ఎంతమంది కాంట్రాక్టర్లు సైట్ సందర్శించారు? మీకు ఎన్ని ఈమెయిల్స్ వచ్చాయి? ఎన్ని లేఖలు వచ్చాయి? ఎన్ని సర్టిఫికేట్లు సింగరేణి సంస్థ జారీ చేసింది? అని ప్రశ్నించారు. వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సైట్ విజిట్ లో కొంతమందినే ఎందుకు ఎంపిక చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రజల దృష్టి మళ్లించేందుకే విచారణ పేరిట ఒక్కొక్కరిని పిలుస్తున్నారన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Prev Post
Next Post