💥 జనవరి 28 రాజారామన్న జయంతి
భారత అణు శాస్త్రవేత్త. భారతదేశం శాస్త్ర,సాంకేతిక రంగాలలో సంచలన విజయాలు సాధించడంలో, అద్భుతమైన ప్రగతిని సాధించడంలో కీలకపాత్ర వహించిన వారిలో ఈయన ఒకరు. భారతదేశం అణుబాంబును తయారు చేయడంలో ఈయన కీలకపాత్ర పోషించారు. భారతదేశం మొట్టమొదటగా స్మైలింగ్ బుద్ధ అనే పేరుతో చేపట్టిన అణ్వస్త్ర పరీక్షలో ఈయన కీలక పాత్ర పోషించాడు.
కర్ణాటకలోని మైసూర్‌లో 1925 జనవరి 28 నాడు జన్మించిన రాజారామన్న ప్రాథమిక విద్యాభ్యాసం మైసూర్‌లోనే చేశారు.తరువాత బెంగుళూర్, మద్రాసు నగరాలలో ఉన్నత విద్యాభ్యాసం చేసి లండన్‌లోని కింగ్స్ కాలేజి నుండి అణుభౌతిక శాస్త్రంలో పిహెచ్.డి. చేశారు.1949లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో ప్రొఫెసర్‌గా రామన్న తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అక్కడ సుప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు డా. హోమీ జహంగీర్ భాభా సాహచర్యం రాజారామన్నను ఎంతగానో ప్రభావితం చేసింది.
తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం నిర్మాణం డా. హోమీభాభా బాధ్యతలను రాజా రామన్నకు అప్పగించారు. వాటిని రామన్న సమర్ధవంతంగా నిర్వహించారు. భారతప్రభుత్వం హోమీభాభా మరణం తరు వాత అటామిక్ ఎనర్జీ కమీషన్ ఛైర్మన్‌గా, అటామిక్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ కార్యదర్శిగా రాజారామన్నను నియమించింది.
1989 టాటాల ప్రోత్సాహం, ఫ్రాన్స్ నుండి ఆర్థిక సహకారం అందడం వలన రాజారామన్న తన ఉద్యోగానికి రాజీనామా చేసి బెంగుళూర్‌లో పరిశోధనా సంస్థను స్థాపించారు.
1966లో ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు అణుపరికరాల తయారీకి సంబంధించిన ప్రాజెక్ట్ కొనసాగింది.ఆ ప్రాజెక్ట్ కు పనిచేసే 75 మంది శాస్త్రవేత్తల బృందానికి రాజా రామన్న నాయకత్వం వహించారు. బార్క్ ‘పూర్ణిమ’ అనే పేరుతో ప్లుటోనియం ఇంధనంతో నడిచే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ స్థాపించడానికి కారకులయ్యారు.1974 మే నెలలో అతి రహస్యంగా అణు పరీక్షను నిర్వహించారు. 1978లో అప్పటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్, డా” రామన్నను బార్క్ నుండి తీసు కొచ్చి, రక్షణ మంత్రిత్వ శాఖకు సలహాదారుగా నియమించారు. రక్షణ పరిశోధన కార్యదర్శిగా, డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ గా కూడా నియమించారు. అప్పుడే ఒక విచి త్రమైన సంఘటన జరిగింది. ఈయన నేపథ్యం తెలుసుకుని ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ అణుబాంబుల తయారీలో రామన్న సహాయం అర్థించాడు. పరిస్థితి విషమించేట్టుగా ఉందనుకుని దేశభక్తుడయిన రాజా రామన్న చెప్పా పెట్టకుండా ఇండియా విమానం పట్టుకుని హుటా హుటిన తిరిగొచ్చారు. నిబద్ధత గల దేశభక్తుల చర్యలు అలా ఉంటాయి. వారు వేటికీ లొంగరు.
హోమీ జె.భాభా అకాల మరణం తర్వాత ఆయన నిర్దేశించిన మార్గంలోనే రాజా రామన్న పరిశోధనలు కొనసాగించి ఆణుశక్తి పరిశోధనల్లో దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టారు. ఆయన న్యూక్లియర్ ఫిషన్ రంగంలో కూడా కృషి చేశారు. బరువైన కేంద్రకాలను విభజించి శక్తిమంతమైన న్యూక్లియన్ రేడియేషన్ ను ఉత్పత్తి చేయవచ్చని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.ఆ సిద్ధాంతం అణుపరిశోధనా రంగానికి, తద్వారా దేశ ప్రగతికి ఎంతో ఉపయోగపడింది.1980లో ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా తిరిగి రావడంతో అణు కార్యక్రమం ఊపందుకుంది. ఆమె రామన్నను మళ్ళీ బార్క్ కు డైరెక్టర్ గా నియమించారు. పైగా అణుపరీక్షల కోసం అయనకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. 1990లో వి.పి. సింగ్ ప్రభుత్వంలో రామన్న కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గాను పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మవిభూషణ్ తో పాటు అనేక పురస్కారాలు, పతకాలు,డాక్ట రేట్లు పొందారు. ఆయన 2004
సెప్టెంబర్ 24 న మరణించాడు.
* సుధాకర్.ఏ.వి
* రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు
* స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (STUTS)
* 9000674747