Take a fresh look at your lifestyle.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత-ఎస్పీ సునిత రెడ్డి

ముద్ర, వనపర్తి :
పిల్లల బాల్యం బడులకు అంకితం కావాలని, బాలలు కార్మికులుగా మారకుండా విద్యాబాటలో నడవాలన్నదే బాల కార్మిక నిర్మూలన లక్ష్యమని జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి తెలిపారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ఈనెల 1వ తేదీ నుండి 31 వరకు వనపర్తి జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమమే “ఆపరేషన్ స్మైల్ – XII” అని ఆమె తెలిపారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న తీవ్రమైన సమస్యలలో బాల కార్మిక వ్యవస్థ ఒకటని అన్నారు. 5 నుండి 14 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలను కార్మికులుగా పనిచేయించడం వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లేనని స్పష్టం చేశారు. వ్యవసాయం, గనులు, తయారీ, నిర్మాణ రంగం, పరిశ్రమలు, కర్మాగారాలు, హోటళ్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు, పౌల్ట్రీ ఫారాలు, బిక్షాటన వంటి అనేక రంగాలలో బాలలు కార్మికులుగా పనిచేస్తుండటం ఆందోళన కరమని తెలిపారు. బాల కార్మికులుగా కొనసాగడం వల్ల పిల్లలు సరైన విద్యకు, ఆరోగ్యానికి, భవిష్యత్తులో ఉన్నత జీవితం గడిపే అవకాశాలకు దూర మవుతున్నారని అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యతో పాటు సరైన పోషకాహారం, ఆటలలో చురుకుదనం, తోటి పిల్లలతో పోటీపడే సామర్థ్యం అవసరమని, ఇవన్నీ బాల కార్మిక వ్యవస్థ కారణంగా కోల్పోతున్నారని చెప్పారు. సరైన మార్గదర్శకత్వం, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సహకారం లేకపోవడం వలన కొంతమంది చిన్నారులు నేరాల వైపు మళ్లే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు.
నేటి బాలలే రేపటి పౌరులు, చిన్నారులే దేశ భవిష్యత్తుకు పునాది అని, అభివృద్ధిలో పరుగులు పెడుతున్న హైటెక్ యుగంలో కూడా బాల కార్మిక వ్యవస్థ చిన్నారుల బాల్యాన్ని నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాల కార్మికులు లేని, ఆరోగ్య వంతమైన పిల్లలతో కూడిన సమాజమే నిజమైన అభివృద్ధికి చిహ్నమని అన్నారు. బాల కార్మిక వ్యవస్థకు ప్రధాన కారణాలుగా పేదరికం, నిరక్షరాస్యత, తక్కువ ఆదాయం, కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితులను పేర్కొంటూ, ఈ కారణాల వల్ల అనేక కుటుంబాలు తమ పిల్లలను పనుల్లోకి నెట్టివేస్తున్నాయని తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ అనే కబంధ హస్తాల నుంచి చిన్నారులను విముక్తి చేయాలనే లక్ష్యంతో 2014 నుండి ప్రతి సంవత్సరం జనవరి నెలలో “ఆపరేషన్ స్మైల్”, జూలై నెలలో “ఆపరేషన్ ముస్కాన్” కార్యక్రమాలను పోలీసుశాఖ పకడ్బందీగా అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా బాలలను పనిస్థలాల నుంచి రక్షించి పాఠశాలల్లో చేర్చడం, తప్పిపోయిన పిల్లలను తల్లిదండ్రుల చెంతకు చేర్చడం జరుగుతోందని వివరించారు.
ఎవరైనా బాల కార్మికులు కనిపించినా లేదా బాలలు పనిచేస్తున్నట్లు సమాచారం ఉన్నా చైల్డ్‌లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 లేదా అత్యవసర నెంబర్ 112కు ఫోన్ చేసి తెలియజేయాలని ప్రజలను కోరారు. 18 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలను వెట్టిచాకిరి, బలవంతపు బిక్షాటన, కిరాణా దుకాణాలు, మెకానిక్ షాపులు, హోటళ్లు, ఇటుక బట్టీలు, పౌల్ట్రీ ఫారాలు తదితర ప్రదేశాల్లో పని చేయించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. ఈ సంవత్సరం ఆపరేషన్ స్మైల్ – XIIలో భాగంగా బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై 20 కేసులు నమోదు చేసి, 55 మంది బాలలు, 02 మంది బాలికలు, మొత్తం 58 మంది బాల కార్మికులను రక్షించి విముక్తి కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పోలీస్ శాఖతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ హృదయపూర్వకంగా అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.