Take a fresh look at your lifestyle.

పదవ తరగతి పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు:జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
జిల్లాలో కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య స్పష్టం చేశారు.నిబంధనలు కచ్చితంగా పాటించాలని అధికారులకు ఆదేశించారు.

జిల్లాలో కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షలను పారదర్శకంగా,కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ సూపరింటెండెంట్లు, ఎంఈఓలు,డిపార్ట్మెంటల్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె దిశానిర్దేశం చేశారు.


పరీక్ష కేంద్రాల్లోకి ఎవరూ మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని,కేంద్రంలో ఉన్న సిబ్బంది సహా ఎవరి వద్దా మొబైల్ ఫోన్లు ఉండకూడదని స్పష్టం చేశారు.పరీక్ష ప్రారంభానికి ముందు ప్రతి హాలును క్షుణ్ణంగా పరిశీలించి చూడాలని సూచించారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు తెలిపారు.
ప్రతి పరీక్ష కేంద్రానికి ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి సంఘటనలు జరిగినా సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్, ఎంఈఓలదే బాధ్యత అని స్పష్టం చేశారు.
సబ్జెక్ట్ టీచర్లను క్లరికల్ సిబ్బందిగా ఉపయోగించిన్నట్లయితే వారిని వెంటనే రిలీవ్ చేసి ఎస్జీటీ కేడర్ ఉపాధ్యాయులను నియమించాలని ఆదేశించారు.
అకాల వర్షాల నేపథ్యంలో ప్రశ్నాపత్రాలు,ఆన్సర్ షీట్లను క్లోజ్డ్ వాహనాలలో సురక్షితంగా తరలించాలని సూచించారు.
పరీక్షల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకొన్నారు.
ఈసమావేశంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఎంఈఓలు,చీఫ్ సూపరింటెండెంట్లు, డిపాట్మెంటల్ అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.