- కందుకూరు రెవెన్యూ అవగాహన సదస్సులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
ఉమ్మడి రంగారెడ్డి, ముద్ర ప్రతినిధి: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేందుకే భూ భారతి చట్టం 2025 ఎంతగానో దోహద పడుతుందని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం కందుకూర్ లోని టంకరీ రాంరెడ్డి ఫంక్షన్ హాలు నందు ఏర్పాటు చేసిన భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం పై రైతులకు అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాల్గొన్నారు.అవగాహన సదస్సులో ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టంలోని మార్గదర్శకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించగా ఆ వివరాలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి రైతులకు ప్రజలకు వివరంగా చదివి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు తమ భూముల విషయం లో ఉన్న అభద్రత భావాన్ని తొలగించి, జవాబుదారు తనాన్ని పెంచేందుకు ప్రభుత్వం భూ భారతి నూతన చట్టాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, నిషేధిత భూములు,ఆర్ ఓ ఆర్ మార్పులు చేర్పులు, సాదా బైనామా వంటి సేవలు సులభతరం అవుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు సరళంగా ఉండే విధంగా గ్రామీణ ప్రజల, రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేలా భూ భారతి రూపొందించడం జరిగిందని అన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామాల్లోకి ప్రజల వద్దకు అధికారులే వచ్చి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని కలెక్టర్ తెలిపారు.జిల్లాలో ఉన్న అసైన్మెంట్, సాదా బైనమాలు, పాసు పుస్తకాలలోని సమస్యలను పరిష్కరించేందుకు కొత్త ఆర్ఓఆర్ చట్టం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఆధార్ తరహాలో భవిష్యత్తులో భూములకు సంబంధించి సర్వే చేసి, హద్దులు, కొలతలు, భూముల వివరాలు ఒకే పుస్తకంలో ఉండేలా ‘భూధార్’ను రూపొందించనున్నట్లు తెలిపారు. ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరం ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి వచ్చేదని అన్నారు. భూ భారతి ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే భూ భారతి చట్టం ప్రకారం అప్పీలు చేసుకునే అవకాశం కూడా ఉందని అన్నారు. తహసీల్దార్ స్థాయిలో దరఖాస్తు చేసుకుంటే న్యాయం జరగలేదని భావిస్తే ఆర్డీవోకు, అక్కడ కూడా సంతృప్తి చెందకపోతే కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
డెవలప్మెంట్ కో ఆపరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ చల్లా నర్సింహా రెడ్డి, కందుకూర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, తహసిల్దార్, అధికారులు, రైతులు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
