Take a fresh look at your lifestyle.

ఉద్యోగులు, పెన్షనర్ల పై సి ఎం వ్యాఖ్యలు అవమానకరం

  • వారిని విస్మరిస్తే గత అనుభవాలు ఖాయం.
  • అఖిల భారత పెన్షనర్ల సంఘం జాతీయ కార్యదర్శి లింగన్న.

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను అవమానించేలా సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం బాధాకరమని అఖిల భారత పెన్షనర్ల సంఘం జాతీయ కార్యదర్శి ఎం సి లింగన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సి ఎం స్థాయికి తగవని, ఉద్యోగుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయని ఆయన నిరసన వ్యక్తం చేశారు.ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు వ్యతిరేకంగా పని చేసిన ప్రభుత్వాలను ఇంటికి పంపినా విషయం మరువరాదని ఆయన అన్నారు.నిర్మల్ జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో తమకు న్యాయంగా రావాల్సిన సౌకర్యాలను అడగటమే తాము చేసిన నేరమా? అని ప్రశ్నించారు. రెండేళ్లుగా పదవీ విరమణ పొంది, రిటైర్మెంట్ ప్రయోజనాలు అందక మనోవేదనకు గురవుతున్న వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం బాధాకరమన్నారు.చివరికి ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ సర్వీస్ కాలంలో పొదుపు చేసిన పి ఎఫ్ బకాయిలు కూడా ఇవ్వకపోవడం శోచనీయమన్నారు.ఒకవైపు రిటైర్మెంట్ ప్రయోజనాలు అందక, పిల్లల వివాహాలు చేయలేక, అనారోగ్య పరిస్థితులకు లోనై పలువురు రిటైర్డ్ ఉద్యోగులు మృతి చెందారని ఆవేదన వెలిబుచ్చారు.ఇదిలా ఉంటే దాదాపు 35 నుంచి 40 సంవత్సరాల పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేర్చటంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందించలేకపోవటం దురదృష్టకరమన్నారు. ప్రజల కోసం, ప్రజల్లో ఒకరిగా పని చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను ప్రజల నుంచి వేరు చేసేలా వ్యాఖ్యలు చేస్తూ విభజించి పాలించు అన్న ధోరణి అవలంభిస్తున్నారని విమర్శించారు.గతంలో ఉద్యోగ వ్యతిరేక ధోరణి అవలంభించిన ప్రభుత్వాలకు ఎదురైన అనుభవాలు పునరావృతం అవుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ హన్మంత్ రెడ్డి, పి విలాస్, లోలం గంగన్న తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.