ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………….
పాలమూరు అభివృద్ధే ప్రధాన ఎజెండా గా పెట్టుకుని పనిచేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ లోని అల్మాస్ ఫంక్షన్ హాల్ లో ముస్లిం సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్‌గా ఎన్నికైన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో పాటు నూతనంగా ఎన్నికైన మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి, కార్పొరేటర్లను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసే ప్రజాప్రతినిధులను ప్రోత్సహించడం ఎంతో అభినందనీయమన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్,కార్పొరేటర్లను ఒకే వేదికపై సన్మానించడం సమాజంలో ఐక్యత, సామరస్యానికి బాటలు వేస్తున్న మహబూబ్ నగర్ ముస్లిం సంఘాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా గత బీఆర్ఎస్ పాలనలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ వంటి ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందాయని, ఆ సమయంలో మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం మహబూబ్ నగర్‌కు చెందిన మన మట్టి బిడ్డ రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నందున జిల్లాకు విస్తృతంగా నిధులు మంజూరు అవుతున్నాయని తెలిపారు. ఈ నిధుల సహకారంతో మహబూబ్ నగర్ నగరాన్ని విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయడం జరుగుతోందని, యువతకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదన్నారు. అలాగే నగరాన్ని ట్రాన్స్‌పోర్ట్ , మెడికల్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పట్టణ అభివృద్ధి, పరిశుభ్రత, తాగునీటి సరఫరా, రహదారుల విస్తరణ వంటి అంశాల్లో ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, అజ్మత్ అలి, మహబూబ్ నగర్ ముస్లిం సంఘం అధ్యక్షులు ఎంఎ అలీం, కార్యదర్శి మహ్మద్ బషీర్దీన్, సభ్యులు ఖాజా మైనోద్దీన్, ఎంఎ రహామాన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
………………………………………..
మండల్ ఆశయాలు సాదిద్దాం
…………………………………….
బీ.పీ మండల్ ఆశయాల సాధనకు కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందనియెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ లోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో ఉన్న బి.పి.మండల్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.బీపీ మండల్ సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. మండల్ కమిషన్ అమలు ద్వారా దేశవ్యాప్తంగా ఓబీసీ వర్గాలకు వచ్చిన మార్పులను గుర్తుచేశారు. ఇంకా ఓబీసీలకు పూర్తి స్థాయి న్యాయం జరగాల్సి ఉందని పేర్కొన్నారు. ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సంకల్పించిందని, తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ ప్రక్రియను అడ్డుకుంటోందని విమర్శించారు. ఓబీసీలకు హక్కుగా రావాల్సిన వాటాను ఇప్పటివరకు చట్టబద్ధం చేయడంలో విఫలమైందని పేర్కొన్నారు. ఇది భిక్ష కాదని, ఓబిసిల హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ఓబీసీల హక్కుల కోసం దేశ స్థాయిలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్,మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి , డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాములు యాదవ్, జిల్లా గొర్ల కాపరుల సంఘం అధ్యక్షులు శాంతయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, అజ్మత్ అలి పాల్గొన్నారు.