ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా కడెం మండలం మాసాయిపేట్ సర్పంచ్ దుర్గం లహరిక పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగిన లహరిక ఆరోగ్యపరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రికి తీసుకెళ్తున్న వాహనం మార్గమధ్యంలో అదుపుతప్పి రోడ్డుపై నిలిపి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్నది. వెంటనే మరో వాహనంలో లహరికను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందించినప్పటికీ లహరిక మృతి చెందారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.