- భారత్, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ నిర్ణయం.
- యుద్ధం ముగిసే వరకు అమల్లోకి ఉంటుందని స్పష్టీకరణ.
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లో బాణాసంచా కాల్చడంపై రాష్ట్ర సర్కార్ నిషేదం విధించింది. భారత్, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో దేశం అంతటా హై అలర్ట్ పరిస్థితి ఉండటం, తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో భద్రతా సన్నాహక చర్యల కొనసాగుతున్న ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సిటీ పోలీసు చట్టం, 1348 ఫస్లీ (నం. IX) సెక్షన్ 67 (సి) కింద ఆయనకు అప్పగించిన అధికారాలను వినియోగించుకుంటూ, ప్రజా భద్రత ప్రయోజనాల కోసం, ముఖ్యంగా సైనిక కంటోన్మెంట్, చుట్టుపక్కల, పబ్లిక్ స్థలాల్లో బాణసంచా లేదా ఫైర్‌వర్క్‌లను పేల్చడం కఠినంగా నిషేధించబడినట్లు ప్రజలకు తెలిపారు.భారత్-పాక్ మధ్య యుద్ధ పరిస్థితులు సద్దుమణిగే వరకు నగరంలో బాణాసంచా కాల్చవద్దని హెచ్చరించారు. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో బాణసంచా నుంచి వచ్చే భారీ శబ్దాలు సంక్షోభ సంకేతాలు, పేలుడు, ఉగ్రవాద సంబంధిత కార్యకలాపంగా సులభంగా తప్పుగా అర్థం అయ్యే అవకాశం ఉందని వివరించారు. ఇది ప్రజల్లో భయాందోళనకు దారితీసి, ప్రజా శాంతి భద్రతలకు భంగ పరచవచ్చని, బాణసంచా శబ్దాలు భద్రతా దళాలపై అనవసరమైన ఒత్తిడి కలిగించవచ్చని చెప్పారు. ఇటీవల దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో కొనసాగుతున్న ఉన్నత స్థాయి భద్రతా చర్యలు, నిరంతర జాగ్రత్తల దృష్ట్యా, ఇటువంటి చర్యలు ప్రజా భద్రతను ప్రమాదంలోకి నెట్ట వచ్చని అబిప్రాయపడ్డారు. ఏదైనా అత్యవసర పరిస్థితికి స్పందించడాన్ని సంక్లిష్టం చేయవచ్చని అభిప్రాయంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.ఈ ఆదేశాన్ని ఉల్లంఘించిన వ్యక్తులు ఎంతటి వారు అయినా సంబంధిత చట్టాల కింద చట్టపరమైన చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందన్నారు.బాణాసంచాపై నిషేద ఆదేశం వెంటనే అమలులోకి వస్తుందని, తదుపరి ఆదేశాల వరకు కొనసాగుతుందని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.