శర్మపై: కైఫ్ ప్రశంసలు
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడైన ఆటతీరుపై మాజీ భారత క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ప్రశంసల వర్షం కురిపించాడు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్‌తో పోల్చుతూ, అభిషేక్ శర్మ ఆట మరింత విధ్వంసకరమని అభిప్రాయపడ్డాడు. గేల్ క్రీజులో సెట్ కావడానికి సమయం తీసుకునేవాడని, అయితే అభిషేక్ తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడతాడని పేర్కొన్నాడు.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో అభిషేక్ శర్మ అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తొలి మ్యాచ్‌లో కివీస్ బౌలింగ్‌ను చీల్చి చెండాడిన అతడు, రెండో మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగినా మూడో టీ20లో మళ్లీ తన అసలైన రూపం చూపించాడు. కేవలం 14 బంతుల్లోనే అర్ధశతకం సాధించి భారత్ తరఫున ఈ ఘనత అందుకున్న రెండో బ్యాటర్‌గా నిలిచాడు.
తాజాగా తన యూట్యూబ్ చానల్ వేదికగా మాట్లాడిన మహమ్మద్ కైఫ్… “సాధారణంగా దూకుడుగా ఆడే బ్యాటర్లు స్థిరంగా రాణించలేరు. కానీ అభిషేక్ శర్మ ఈ నియమానికి మినహాయింపు. క్రిస్ గేల్ కూడా పెద్ద షాట్లు ఆడేవాడు కానీ, చాలా ఆలోచనతో బ్యాటింగ్ చేసేవాడు. అవసరమైతే మెయిడిన్ ఓవర్లను కూడా భరించి క్రీజులో నిలదొక్కుకునేవాడు. ముఖ్యంగా బెంగళూరు లాంటి పిచ్‌లపై అతడు చాలా నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించేవాడు” అని వివరించాడు.
అయితే అభిషేక్ శర్మ పూర్తిగా భిన్నమైన ఆటగాడని కైఫ్ స్పష్టం చేశాడు. “అభిషేక్ సెట్ అయ్యేందుకు సమయం తీసుకోడు. మైదానంలో అడుగుపెట్టిన క్షణం నుంచే భారీ షాట్లకు తెగిస్తాడు. అలాంటి ఆటగాళ్లకు నిలకడ ఉండదని భావిస్తారు. కానీ అభిషేక్ ప్రతి మ్యాచ్‌లోనూ తన సత్తాను నిరూపిస్తున్నాడు. కేవలం 12 నుంచి 14 బంతుల్లోనే 60–70 పరుగులు సాధించడం అతడిని నిజమైన మ్యాచ్ విన్నర్‌గా నిలబెడుతోంది. 2026 టీ20 ప్రపంచకప్‌లో అతడు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే టీమిండియానే ట్రోఫీని అందుకుంటుంది” అని కైఫ్ ధీమా వ్యక్తం చేశాడు.
ఇదిలా ఉండగా, అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్, టీమిండియా సమిష్టి ప్రదర్శనతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-0తో కైవసం చేసుకుంది. నాలుగో మ్యాచ్ విశాఖపట్నం వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఈ మైదానంలో మరోసారి అభిషేక్ సిక్సర్ల వర్షం కురిపిస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.