ముద్ర, బోడుప్పల్:
గృహ నిర్మాణం, తొలగింపు వంటి కార్యక్రమాల్లో వచ్చే వ్యర్థాలను రోడ్డు పక్కన పడవేయకుండా మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని బోడుప్పల్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఎ.శైలజ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” లో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మార్గదర్శకత్వంలో బోడుప్పల్ సర్కిల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భవన నిర్మాణ వ్యర్థాలను షెడ్యూల్ ప్రకారం సేకరించి తరలించే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ కమిషనర్ ఎ .శైలజ, డీఈఈ ( ఎస్.డబ్ల్యూ.ఎమ్ ) కె. జాహ్నవి శశాంక్ తో కలసి హాజరై మాట్లాడారు. ఈ వ్యర్థాలను రాంకీ సంస్థ ద్వారా ప్రతి టన్నుకు రూ.420/- ఫీజు చొప్పున సేకరించి తరలిస్తామని తెలిపారు. అందువల్ల పట్టణ గృహ నిర్మాణ దారులు ఈ తరహా వ్యర్థాలను రాంకీ సంస్థ కు అందచేయాలని కోరారు. ప్రజలు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ఆమె కోరారు.