- ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్ కు క్లీన్ చిట్ ఇవ్వలేదు
- గిట్టని వాళ్లే నాపై దుష్ప్రచారం చేశారు
- తెలంగాణ అభివృద్ధికి, పెట్టుబడుల ఆకర్శణకే ఫార్ములా ఈ- రేసు
- దాంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది
- విచారణ తర్వాత వాస్తవాలు బయటికి వస్తాయి
- హైడ్రా కొనసాగింపుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి
- పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన విషయాన్ని మరిచిపోవద్దు
- మీడియాతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చినా భయపడనని సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఫైటర్ ను అన్నారు. దేనికైనా సిద్ధంగా ఉంటానని తేల్చి చెప్పారు. ఆదివారం మీడియతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తానేమి క్లీన్ చిట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడానంటూ సోషల్ మీడియాలో తనపై జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించారు. తెలంగాణ అభివృద్ధికి,పెట్టుబడులను ఆకర్షించేందుకు ఫార్ములా ఈ- రేసు నిర్వహించడం మంచిదేనన్నారు. దాంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందన్నారు.
ఫార్ములా ఈ-రేసుపై కేటీఆర్ తన సలహా తీసుకున్నారన్న ఆయన అప్పుడే ఆ విషయంలో తన అభిప్రాయం చెప్పానన్నారు. కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడానంటూ పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.ఈ కేసుపై ఏసీబీ, ఈడీ విచారణ కొనసాగుతుందన్నారు. ఎన్నికల సయయంలోనే నిధుల మళ్లింపులో క్విడ్‌ప్రోకో జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు.కేసు విచారణ పూర్తయిన తర్వాత అన్ని వాస్తవాలు అవంతట అవే బయటకు వస్తాయన్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. గతాన్ని చూసి పాలన కొనసాగించాలన్నారు. నగరంలో చెరువులు,ఆక్రమిత స్థలాల్లో నిర్మాణాలు కూల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా కొనసాగింపుపై కాంగ్రెస్ సర్కార్ పునరాలోచన చేయాలని సూచించారు.
ఆ వ్యవస్థ ఏర్పాటు విషయంలో గతంలో తాను చేసిన వ్యాఖ్యలో ఏ మార్పు లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీసుకున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో పేద, మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీపై పరివాహక ప్రాంతంలో బీజేపీ నేతలు కంటితుడుపుగా ఒక్క రోజు నిద్ర చేశారని.. వాళ్లకు నిద్రకు ముందే అక్కడికి ఏసీలు వెళ్లాయని ఎద్దేవా చేశారు. వారి ఇళ్ళల్లో చేసిన జొన్న రెట్టేలు తినకుండా..కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నారన్నారు.ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ చూస్తే ఖాళీగా ఉందన్నారు. అయినా ఇచ్చిన హామీలను ఎలాగైనా అమలు చేయాలనే పట్టుదలతో కాంగ్రెస్ ముందుకెళ్తోందన్నారు. ప్రభుత్వం రైతు రుణ భరోసా చేసిన రోజు ఎంతో సంబరాలు చేయాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు. కానీ కానీ రాష్ట్ర ప్రభుత్వం అలా చేయలేదన్నారు. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉందన్నారు. ఇదే కారణంతో ఇక్కడ కొన్ని సంస్థలు వచ్చి సెటిల్ అయ్యాయని చెప్పారు. భద్రమైన నగరంగా పేరున్న హైదరాబాద్ కు ముంబైకి వెళ్లాల్సిన ప్రముఖ కంపెనీలు ఇక్కడ పెట్లుబడులు పెడుతున్నారన్నారు.