-తెలంగాణలో రాజ్యసభ రేసు..
– కాంగ్రెస్ పెద్దల మధ్య ‘గట్టి’ పోటీ!
– తెలంగాణలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలు..
-కాంగ్రెస్ లో తీవ్రమైన పోటీ.. రేసులో ఉన్నది వీరే..!
– టికెట్ ఆశిస్తున్న సీనియర్లు, టికెట్ త్యాగం చేసిన వారు
ముద్ర, డెస్క్:
తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల కోసం అధికార కాంగ్రెస్ పార్టీలో పోటీ తీవ్రంగా మారింది. అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం కారణంగా ఈ రెండు సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడటం ఖాయమనే నేపథ్యంలో ఆ స్థానాలను దక్కించుకోవడానికి పార్టీ సీనియర్ నేతలు, ఆశావహులు లాబీయింగ్ ప్రారంభించారు.
ఏప్రిల్ 9న ప్రస్తుత రాజ్యసభ సభ్యులు అభిషేక్ మను సింఘ్వి, సురేష్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. జాతీయ స్థాయి నాయకుడైన సింఘ్వికి మరోసారి అవకాశం ఇవ్వాలనే సంకేతాలు ఉన్నట్లు సమాచారం. దీంతో రెండో సీటు కోసం రాష్ట్ర నేతల మధ్య పోటీ మరింత వేడెక్కింది.
ఈ సీటు కోసం కె. కేశవరావు, వి. హనుమంతరావు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఇరవత్రి అనిల్, టి. వెంకట్రామి రెడ్డి వంటి నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీకి దీర్ఘకాలంగా సేవలందించిన సీనియర్లు, అలాగే గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన నాయకులు తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీలో ఒక రాజ్యసభ సీటు గెలవడానికి సుమారు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్‌కు 64 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో పాటు ఇతరుల మద్దతు కూడా ఉండే అవకాశంతో రెండు స్థానాలు గెలుచుకోవడం సులభమని అంచనా. అయితే అభ్యర్థుల ఎంపికలో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తారా? లేక సామాజిక, రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటారా? అన్నది స్పష్టత రానుంది.
కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ జారీ కానుంది. నామినేషన్లకు మార్చి 5 చివరి తేదీగా నిర్ణయించారు. మార్చి 16న పోలింగ్ జరగనుండగా, మార్చి 20న ఫలితాలు ప్రకటించనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ త్వరలోనే పార్టీ అధిష్టానంతో భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం అభ్యర్థులపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్ సహా పది రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో అయితే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
